మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి..
- క్షణికానందానికి నిండు జీవితాన్ని బలి చేయొద్దు..
- లక్ష్యాన్ని ఎంచుకుంటే ఉన్నత శిఖరాలు చేరవచ్చు..
- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : సమాజంలో ఒక్కొక్కరు ఒక సోల్జర్గా మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హాజరైన సిపికి పాఠశాల స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులతోపాటు ఉపాధ్యాయినీలు పోలీసు బృందం పరేడ్, కవాతు నిర్వహించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావె శంలో ముందుగా తెలంగాణ గీతాన్ని ఆలపించారు.
అనంతరం సిపి మాట్లాడుతూ చక్కటి వాతావరణంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అందరూ మంచి లక్ష్యంతో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని.. ఆ దిశగా పయనించాలన్నారు. తద్వారా సమాజంలో మీరు ఎంచుకున్న ఒక గొప్ప స్థాయిలో ఉంటారన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని ఎంచుకొని చదివితే ఒక్కొక్కరు ఒక్కో అధికారిగా మారే స్థాయిలో ఉంటారన్నారు. పాఠశాలలో సెలవు దినాలలో తమ గృహాలకు వెళ్లిన వారికి గ్రామాలలో మత్తు పదార్థాలు కనిపిస్తే వాటిని ఉక్కు పాదంతో అణచి వేసేలా వ్యవహరించాలని సూచించారు.
తమ తల్లిదండ్రులతో డ్రగ్పై చర్చించి వాటిని సేవిస్తే జరిగే అనర్థాలను వివరించాలన్నారు. విద్యార్థులు క్షణికావేశానికి లోనై మత్తు పదార్థాలు సేవిస్తే ముందు బాగానే ఉన్నా.. తర్వాతే అది వారి జీవితాన్ని బుగ్గిపాలు చేస్తుందన్నారు. మత్తుకు అలవాటు పడినవారు తిరిగి కొ లుకోవడం జరగదన్నారు. విద్యార్థులు ఎట్టి పరిస్థితిలో మత్తు పదార్థాలకు బానిసగా మారవద్దని, వాటిని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని, ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అనంతరం డ్రగ్స్ వ్యతిరేక నిర్మూలన ప్రతిజ్ఞను చేయించి డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ పొన్నమనేని రంజిత్ కుమార్, నార్గోటిక్ సీఐ రాజ్కుమార్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు చంద్రకుమార్, మల్లేష్, మధుకర్, మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్య, సోషల్ వెల్ఫేర్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ధనలక్ష్మి, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం కవితతోపాటు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
