త్రివర్ణ పతాకాల రెపరెపలు.. టేకుమట్లలో దేశభక్తి వెల్లువ
టేకుమట్ల, ఆంధ్రప్రభ : దేశభక్తి నినాదాలతో టేకుమట్ల మండల కేంద్రం మార్మోగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు టేకుమట్ల మండలంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ టేకుమట్ల హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు త్రివర్ణ పతాకాలను చేతబూని ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘వందేమాతరం’ నినాదాలతో విద్యార్థులు దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ నాయకులు, దేశభక్తిని ప్రతిబింబించే వివిధ వేషధారణల్లో విద్యార్థులు పాల్గొనడంతో ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగుతూ ప్రదర్శించిన దేశభక్తి, ఉత్సాహం స్థానికులను ఆకట్టుకుంది. దేశం, జాతీయ జెండాపై తమకున్న గౌరవాన్ని విద్యార్థులు ఘనంగా చాటుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. “విద్యార్థులే దేశ భవిష్యత్తు. వారి శక్తి, ప్రతిభ, క్రమశిక్షణ, దేశభక్తితో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది” అని అన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశం కోసం పనిచేసే బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు కూర సురేందర్ రెడ్డి, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, బీజేవైఎం జిల్లా నాయకులు పంజాల కుమార్ గౌడ్, మండల నాయకులు చాటగొల్ల తిరుపతి, మేకల వీరారెడ్డి, దేశెట్టి మహేందర్, దొమ్మటి రవీందర్, దేశెట్టి లక్ష్మయ్య, వివిధ గ్రామాల బూత్ అధ్యక్షులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
