రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం..
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం..
- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సమగ్ర జిల్లా కార్యాలయ సముదాయం (ఐడీఓసీ)లో శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మీడియా సమావేశం నిర్వహించి యాసంగి ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న కొనుగోళ్లు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్), మట్టి రవాణా, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ) ప్రవేశాలపై సమగ్రంగా వివరించారు.
యాసంగి 2025-26 సీజన్‌కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వంద శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. జిల్లాలో 59,342 మంది రైతుల నుంచి 4.35 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసి రూ.1,031 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తంలో ఇప్పటికే 93 శాతం చెల్లింపులు పూర్తిచేసినట్లు తెలిపారు. గత పదేళ్లలో ధాన్యం కొనుగోలు ఇదే అత్యధికమని, 2024-25 యాసంగి సీజన్‌లో 4.01 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరగగా ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నట్లు తెలిపారు.
సీఎంఆర్ బియ్యం సరఫరాలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉందన్నారు. 2024-25 ఖరీఫ్‌లో 100 శాతం, రబీలో 95 శాతం, 2025-26 ఖరీఫ్‌లో 39 శాతం, రబీలో 8 శాతం సీఎంఆర్ డెలివరీ పూర్తయినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు డిఫాల్ట్‌లో ఉన్న 10 రైస్ మిల్లులకు బకాయిలు చెల్లించి, బ్యాంకు గ్యారంటీ సమర్పించిన అనంతరం మాత్రమే ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. ధాన్యం రవాణాకు రోజుకు సుమారు 600 వాహనాలను వినియోగించామని, మొత్తం 1.15 కోట్ల గన్నీ సంచులు ఉపయోగించినట్లు తెలిపారు.
జిల్లాలోని రైస్ మిల్లుల్లో 6.90 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం అందుబాటులో ఉండగా, అవసరాన్ని బట్టి ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా అదనపు నిల్వ స్థలాన్ని వినియోగించినట్లు తెలిపారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 18,191 ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగిందని, తొమ్మిది కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 26 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రూ.63.40 కోట్ల విలువైన మొక్కజొన్న కొనుగోలు చేయగా, ఇప్పటికే రూ.14.84 కోట్ల చెల్లింపులు చేసినట్లు చెప్పారు.
మొక్కజొన్న నిల్వ కోసం 29 వేల మెట్రిక్ టన్నుల స్థలాన్ని గుర్తించామని తెలిపారు. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగినప్పటికీ పలు సవాళ్లు ఎదురయ్యాయని కలెక్టర్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల కారణంగా హమాలీల కొరత, అదే సమయంలో యూరియా నిల్వలు రావడం, ఎఫ్‌సీఐ గోదాముల్లో కార్మికుల కొరత వంటి సమస్యలను అధిగమించి కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రైతులకు ఎక్కడా కోతలు పడకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. మంథని ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మూడు లారీలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
సంబంధిత కొనుగోలు కేంద్రాలపై విచారణ కొనసాగుతోందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తదుపరి నుంచి ఆయా కేంద్రాల్లో మార్పులు చేపడతామని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కొత్త ప్రక్రియ కాదని, 2002లో చివరిసారిగా నిర్వహించగా ప్రస్తుతం స్వాతంత్ర్యం అనంతరం ఎనిమిదోసారి ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఓటర్లలో సుమారు 80 శాతం మందిని 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నామని, ఇంకా 1.80 లక్షల మంది ఓటర్ల వివరాల పరిశీలన మిగిలి ఉందన్నారు.
బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరిస్తారని, అవసరమైన ఆధారాలను జతచేసి సమర్పించాలని సూచించారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి బుధవారం ఈఆర్వో స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహిస్తూ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇటుక బట్టీలకు ఎనిమిది చెరువుల నుంచి 13,250 ట్రిప్పుల మట్టి రవాణాకు అనుమతులు ఇచ్చామని తెలిపారు.
ఈ ప్రక్రియ ద్వారా వసూలు చేసిన రుసుమును ఆయా ప్రాంతాల అభివృద్ధి పనులకు వినియోగిస్తామని చెప్పారు. రైతులు వ్యవసాయ అవసరాల కోసం ఉచితంగా మట్టిని వినియోగించుకోవచ్చని తెలిపారు. మట్టి దుర్వినియోగం జరగకుండా పటిష్టమైన వ్యవస్థను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలో 72 ఎకరాల ప్రభుత్వ భూమిని, నరసింగాపూర్‌లో 48 ఎకరాల భూమిని ఆక్రమణల నుంచి విముక్తం చేసినట్లు తెలిపారు. ముత్తారం ప్రాంతంలో కూడా భూముల స్వాధీనం కోసం చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ భూములను ఎవరూ ఆక్రమించవద్దని, ఆక్రమణలను తప్పనిసరిగా తొలగిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి, రామగుండం ఏటీసీలలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు జూన్ 30 చివరి తేదీగా నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో ఈ కోర్సుల ద్వారా అనేక మంది విద్యార్థులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. మంథనిలో మరో ఏటీసీకి అనుమతి లభించిందని, భూమి కేటాయింపు పూర్తై త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
