నూతన ప్రిన్సిపాల్ శైలజా రాణికి ఘన సన్మానం

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యా రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న ఇద్దరు ప్రముఖ విద్యావే త్తలను సీపీడీసీ సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. కళాశాలకు నూతనంగా నియమితులైన ప్రిన్సిపాల్ శైలజా రాణి, ఆత్మీయ స్వాగతం పలుకుతూ, అలాగే వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మస్తానప్ప డాక్టరేట్ పట్టా సాధించిన సందర్భంగా ప్రత్యేక అభినందన సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీడీసీ సభ్యులు డాక్టర్ శైలజా రాణి, డాక్టర్ మస్తానప్పకు శాలు వాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీడీసీ సభ్యులు డా. ప్రసాద్, లయన్ గణేష్ బాబు, జై కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షులు నాగమల్లి ఓబులేష్ మాట్లాడుతూ, నూతన ప్రిన్సిపాల్ డా. శైలజా రాణి గారి విద్యా అనుభవం, పరిపాలనా నైపుణ్యం కళాశాల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో కళాశాల విద్యా ప్రమాణాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ఆకాంక్షించారు.

అలాగే డాక్టరేట్ పట్టా సాధించిన డా. టి.ఎన్. మస్తానప్ప గారిని అభినందిస్తూ, నిరంతర అధ్యయనం, పరిశోధన పట్ల అంకితభావం, కృషి, పట్టుదలతో ఉన్నత విద్యా శిఖరాలను అధిరోహించడం ప్రతి విద్యార్థి, అధ్యాపకుడికి ఆదర్శమని కొనియాడారు. ఆయన సాధించిన ఈ విజయం కళాశాలకే కాకుండా ఉరవకొండ ప్రాంతానికే గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీడీసీ కో-ఆర్డినేటర్ అయ్యన్న, అధ్యాపకులు పరమేష్, డా. ఆదినారాయణ, డా. రాజేష్, డా. వెంకటరమణ, నారాయణస్వామి, ఎన్. వెంకటేష్, సుజాత, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, విద్యాభిమానులు పాల్గొని సన్మానితులకు శుభాకాంక్షలు తెలిపారు. సీపీడీసీ సభ్యులు మాట్లాడుతూ, విద్యా రంగంలో విశిష్ట కృషి చేస్తున్న అధ్యాపకులను ప్రోత్సహించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.