ఆషాఢ సారె మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం..

ఈనెల 15 నుంచి నెల రోజులపాటు ఉత్సవాలు…
భక్తుల సౌకర్యాలకు పక్కా ఏర్పాట్లు..
కనకదుర్గ నగర్‌లోనే రిజిస్ట్రేషన్, క్లోక్‌రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్, మొబైల్ డిపాజిట్ కేంద్రాలు…
క్యూ లైన్ల ద్వారా క్రమబద్ధమైన దర్శనం… మహామండపం ఆరో అంతస్తులో సారె సమర్పణ.
ఆలయ సిబ్బంది, పోలీసులు, భద్రతా సిబ్బంది సమన్వయంతో ప్రతి దశలో పర్యవేక్షణ…
జూలై 15 ఉదయం 7.30 గంటలకు అమ్మవారికి తొలి సారె సమర్పణ…
ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో ప్రారంభం…
ఆగస్టు 12 వరకు ఉత్సవాలు…
భక్తుల సంతృప్తే లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తి..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈనెల 15 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్న ఆషాఢ సారె సమర్పణ మహోత్సవాలకు దేవస్థానం సర్వసన్నద్ధమైంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం, సారె సమర్పణ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, సేవల నిర్వహణపై సమగ్ర కార్యచరణ సిద్ధం చేశారు.

ఏర్పాట్లు పరిశీలన…

ఉత్సవాల ఏర్పాట్లను ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులతో కలిసి ఈవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శ్రీ కనకదుర్గ నగర్‌లోనే రిజిస్ట్రేషన్ కేంద్రం, క్లోక్‌రూమ్, ఉచిత పాదరక్షల స్టాండ్, మొబైల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సారె సమర్పించే భక్తులు ముందుగా కనకదుర్గ నగర్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని స్లిప్ పొందిన అనంతరం క్యూ మార్గం ద్వారా మహామండపం ర్యాంప్ మీదుగా ఏడో అంతస్తుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శ్రీ భవాని అనుగ్రహ దర్శనం (రూ.100) క్యూ లైన్ ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తారు. దర్శనం అనంతరం మహామండపం ఆరో అంతస్తులో సారె సమర్పించి, రిజిస్ట్రేషన్ స్లిప్ చూపించిన భక్తులకు ఆలయ మర్యాదలతో ఆశీర్వచనం అందజేస్తారు.

అనంతరం రెండో అంతస్తులో అన్నప్రసాదం స్వీకరించి నిష్క్రమించేలా ఏర్పాట్లు చేసినట్లు ఈవో వివరించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ, ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లపై దేవస్థానం కార్యాలయంలో నగర పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డీసీపీ జి. రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, వన్‌టౌన్ సీఐ గుణరామ్, ట్రాఫిక్ సీఐ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కనకదుర్గ నగర్‌లో రిజిస్ట్రేషన్ నుంచి ఆరో అంతస్తులో ఆశీర్వచనం వరకు భక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఆలయ సిబ్బంది, పోలీసులు, భద్రతా సిబ్బందిని కీలక ప్రాంతాల్లో మోహరించాలని నిర్ణయించారు. భక్తుల భద్రతకు దేవస్థానం అమలు చేస్తున్న నిబంధనలకు అందరూ సహకరించాలని ఈవో కోరగా, ఉత్సవాల విజయవంతానికి పోలీసు శాఖ అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తుందని అధికారులు హామీ ఇచ్చారు.

తొలి సారె సమర్పణ…

జూలై 15 ఉదయం 7.30 గంటలకు మహామండపం వైపు నుంచి ఆలయ అర్చక బృందం శాస్త్రోక్తంగా అమ్మవారికి తొలి ఆషాఢ సారె సమర్పించనుందని స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ తెలిపారు. దీంతో నెల రోజులపాటు కొనసాగే ఆషాఢ సారె మహోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి.