journalists | ఇన్‌చార్జి ఎంపికలో రగడ, మీడియాపై దాడి

తంబళ్లపల్లె టీడీపీలో ఇన్‌చార్జి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ
రిడ్జ్ హోటల్ సమావేశంలో ఉద్రిక్తత
జయచంద్రారెడ్డి వర్గానికి నో ఎంట్రీ
త్రిసభ్య కమిటీ ముందు నేతల అభిప్రాయాల సేకరణ
జయచంద్రారెడ్డి వర్గాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
కవరేజ్‌కు వెళ్లిన పాత్రికేయులపై దాడి.. ప్రెస్ క్లబ్ నిరసన
శంకర్ యాదవ్ పేరుపై జోరుగా ప్రచారం
వీడియో విడుదల చేసిన జయచంద్రారెడ్డి

journalists | తిరుపతి సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎంపిక ప్రక్రియ తిరుపతిలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కొత్త ఇన్‌చార్జి ఎంపికలో భాగంగా తిరుపతిలోని రిడ్జ్ హోటల్‌లో సోమవారం పార్టీ త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించగా, జయచంద్రారెడ్డి వర్గానికి ప్రవేశం నిరాకరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో కవరేజ్‌కు వెళ్లిన పాత్రికేయులపై దాడి జరగడం వివాదానికి మరింత ఆజ్యం పోసింది.

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జిల్లా టీడీపీ ఇన్‌చార్జి సుగవాసి ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సుమారు 500 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతో పాటు కొత్త ఇన్‌చార్జి ఎంపికపై నేతల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ విడివిడిగా నమోదు చేసింది.

నేతల అభిప్రాయాల సేకరణ

సమావేశానికి హాజరైన ప్రతి నాయకుడిని విడిగా పిలిచి, పార్టీని బలోపేతం చేయగల నాయకత్వం ఎవరిదనే అంశంపై కమిటీ అభిప్రాయాలు సేకరించింది. ఈ నివేదికను త్వరలో పార్టీ అధిష్ఠానానికి సమర్పించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

జయచంద్రారెడ్డి వర్గానికి ‘నో ఎంట్రీ’

మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి వర్గానికి సమావేశంలో ప్రవేశం కల్పించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సమావేశానికి వచ్చిన ఆయన అనుచరులు తమను ఎందుకు అనుమతించడం లేదని నిర్వాహకులను నిలదీయగా, అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

మంత్రి సమక్షంలోనే వాగ్వాదం

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, జిల్లా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సమక్షంలోనే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పర ఆరోపణలు, నినాదాలతో సమావేశ ప్రాంగణం ఉద్రిక్తంగా మారగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పాత్రికేయులపై దాడి.. ప్రెస్ క్లబ్ నిరసన

ఈ పరిణామాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కొందరు దాడికి పాల్పడ్డారు. టీవీ24 రిపోర్టర్ గిరి, ఎన్టీవీ కెమెరామెన్ మణితో పాటు మరో పాత్రికేయుడు గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పాత్రికేయులు ఘటనా స్థలంలోనే ధర్నా నిర్వహించారు.

తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

జయచంద్రారెడ్డి వీడియో విడుదల

ఇదిలా ఉండగా, తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి మార్పుపై మాజీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి వీడియో విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ఈ ప్రక్రియపై తమ వర్గానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పార్టీ నిర్ణయాల్లో తమను పూర్తిగా పక్కన పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

శంకర్ యాదవ్‌కే బాధ్యతలా?

మరోవైపు తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తోంది. త్రిసభ్య కమిటీ సేకరించిన అభిప్రాయాల ఆధారంగా పార్టీ అధిష్ఠానం త్వరలోనే తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలు, వర్గ విభేదాలు, మీడియాపై దాడి ఘటన తంబళ్లపల్లె టీడీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతం చేశాయి.