‘డ్రగ్స్‌కు నో – క్రీడలకు యెస్’ నినాదంతో ప్రీమియర్ లీగ్ ర్యాలీ

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రీడా ర్యాలీని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శనివారం ఉత్సాహంగా ప్రారంభించారు. స్థానిక డీఎస్ఏ గ్రౌండ్ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సాయి చైతన్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతను సన్మార్గంలో నడిపించే శక్తివంతమైన సాధనమని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు క్రీడల పరంగా మంచి గుర్తింపు ఉందని, ఈ ప్రీమియర్ లీగ్ ద్వారా వివిధ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్, యోగా వంటి క్రీడల్లో అన్ని మండలాల నుంచి యువత పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. విజేతలకు నగదు బహుమతులు కూడా ప్రకటించినట్లు చెప్పారు. యువతలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని వివరించారు.
కోవిడ్ సమయంలో, రోడ్డు ప్రమాదాల వల్ల జిల్లాలో జరిగిన ప్రాణనష్టాలను ప్రస్తావిస్తూ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. యువత డ్రగ్స్ మరియు సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా “డ్రగ్స్‌కు నో – క్రీడలకు యెస్” అనే నినాదాన్ని అందరితో పలికించారు.

అనంతరం కాగడాతో ర్యాలీని ప్రారంభించి, పాత కలెక్టరేట్ గ్రౌండ్, కోర్టు చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, ఎన్‌టీఆర్ చౌరస్తా, పోలీస్ కార్యాలయం, విజయ్ థియేటర్, రైల్వే కమాన్, అయ్యప్ప దేవాలయం, మీ సేవ కేంద్రం మార్గంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీసీపీ బస్వా రెడ్డి, కవిత రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రజనీకాంత్, సంతోష్ తదితరులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

