Practicals | ఇకపై ఫస్టియర్‌లోనే ప్రాక్టికల్స్!

Practicals | ఇకపై ఫస్టియర్‌లోనే ప్రాక్టికల్స్!
Practicals | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం సెకండియర్‌కే పరిమితమైన ప్రాక్టికల్ పరీక్షలను, ఇకపై ఫస్టియర్ (జూనియర్ ఇంటర్) నుంచే ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం మార్గదర్శకాలకు అనుగుణంగా, విద్యార్థుల్లో సృజనాత్మకతను, ప్రయోగాత్మక అవగాహనను పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపడుతున్నారు.
మొదటి సంవత్సరం నుంచే సైన్స్ (ఎంపీసీ, బైపీసీ) విద్యార్థులకు ల్యాబ్ రికార్డులు, ప్రయోగాలు తప్పనిసరి కానున్నాయి. కేవలం వార్షిక పరీక్షల మీదనే ఆధారపడకుండా, ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్కులు కేటాయించే విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్ విద్యార్థులకు కూడా ప్రాజెక్ట్ వర్క్ లేదా స్కిల్ డెవలప్మెంట్ ఆధారిత అసైన్మెంట్లు ఉండే అవకాశం ఉంది. ప్రాక్టికల్స్ నిర్వహించబోతున్న నేపథ్యంలో, తరగతులకు హాజరు కావడం మరింత కీలకం కానుంది.
చాలామంది విద్యార్థులు థియరీలో మంచి మార్కులు సాధిస్తున్నప్పటికీ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి వాటిల్లో ప్రయోగాత్మక ప్రశ్నల వద్ద ఇబ్బంది పడుతున్నారు. మొదటి సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్‌పై పట్టు సాధిస్తే, భవిష్యత్తులో ఉన్నత విద్యలో రాణించడం సులభమవుతుందని బోర్డు భావిస్తోంది. ఈ నూతన విధానం వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ , మార్కుల కేటాయింపుపై బోర్డు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది.
CLICK HERE TO READ MORE : 18 lakh people | సీబీఎస్ఈ 12వ తరగతిలో 85 శాతానికి పైగా ఉత్తీర్ణత..
