పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం…

పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై హర్షం…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే సాహసోపేతమైన పాలసీలు అవసరం : యార్లగడ్డ

గన్నవరం – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే ఇలాంటి సాహసోపేతమైన పాలసీలు అవసరమని, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అందరూ మద్దతించాలని కోరారు.

తలసరి ఆదాయంలో ప్రపంచంలోనే 15వ స్థానంలో ఉన్న స్వీడన్ వంటి ధనిక దేశం కూడా జనాభా పెరుగుదల కోసం ప్రోత్సాహకాలు ఇస్తోందని, అదే క్రమంలో మన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 25,000 ఆర్థిక సాయం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా ఐవీఎఫ్ వంటి చికిత్సలకు ఉచిత సౌకర్యం లేదని, ఇన్సూరెన్స్ ఉంటేనే వైద్యం అందే పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సదుపాయాన్ని తీసుకురావాలనే ఆలోచన అమెరికాకు కూడా రాలేదని ఆయన ప్రశంసించారు.

విదేశాల్లో ఉన్న సుమారు 10 లక్షల మంది ఎన్ఆర్ఐలు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేలా, ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించేలా ప్రభుత్వం ప్రోత్సాహకరమైన పాలసీలు తీసుకువస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినా, భవిష్యత్ తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రసంగంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా ‘వెంటిలేటర్’ మీద ఉన్న స్థితి నుండి బయటకు వస్తోందని, కేవలం దూరదృష్టితోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇజ్రాయిల్ వంటి దేశాలు యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా తమ జనాభా రేటును (TFR) 3 గా మెయింటైన్ చేస్తున్నాయని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply