అచ్చంపేటలో అర్ధరాత్రి..

పోలీసుల స్పెషల్ డ్రైవ్

11 తర్వాత తెరిచి ఉన్న హోటళ్లకు జరిమానాలు
నిబంధ‌న‌లు ఉల్లంఘించొద్దు : ఎస్సై సద్దాం హెచ్చరిక
ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు

అచ్చంపేట మే 20, (ఆంధ్రప్రభ) : నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలో అర్ధరాత్రి వేళ అనవసర సంచారాలను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న ఐదు హోటళ్లపై అలాగే బాక్స్ క్రికెట్ యాజమాన్యంపై అచ్చంపేట ఎస్సై సద్దాం ఆధ్వర్యంలోని పోలీసు బృందం జరిమానాలు విధించింది. అదేవిధంగా అర్ధరాత్రి సమయంలో సరైన కారణం లేకుండా తిరుగుతున్న వాహనదారులను పోలీసులు తనిఖీ చేశారు.

గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) లేకుండా సంచరిస్తున్న పలువురిపై కూడా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పోలీసులు పట్టణ వ్యాపారులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మెడికల్ షాపులు మినహా మిగతా అన్ని దుకాణాలు రాత్రి 11 గంటలలోపు తప్పనిసరిగా మూసివేయాలని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సద్దాం హెచ్చరించారు. అలాగే యువత అర్ధరాత్రి సమయంలో అనవసరంగా రోడ్లపై తిరగవద్దని, ప్రజలు పోలీసులకు సహకరించి శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్సై సూచించారు.

Leave a Reply