కామనపల్లికి పోలీసులు.. ఆంధ్రప్రభ వార్తకు స్పందన…

క్షుద్రపూజల మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన..


జన్నారం, ఆంధ్రప్రభ: పల్లె ప్రకృతి వనంలో చేతబడి కలకలం..కామనపల్లిలో క్షుద్ర పూజలు అనే శీర్షికతో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రభ వెబ్లో వచ్చిన వార్తకు పోలీసులు రాత్రి స్పందించారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ సూచనతో రాత్రి 10 గంటలకు స్థానిక ఏఎస్ఐ ఉమేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కామనపల్లి పల్లె ప్రకృతి వనంలోని క్షుద్ర పూజలు చేసి, చెట్టుకు చిన్న రెండు బొమ్మలు కట్టి జీడిగింజలు కొట్టిన ప్రదేశాన్ని పరిశీలించారు.

ఆ తర్వాత గ్రామ సర్పంచి పేరం శ్రీనివాస్ సమక్షంలో పోలీసులు వాటిని తొలగించారు. అనంతరం గ్రామ కూడలి వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఏఎస్ఐ మాట్లాడుతూ.. క్షుద్ర పూజలు మూఢనమ్మకాలను నమ్మకూడదన్నారు. పల్లె ప్రకృతి వనంలోని చెట్టుకు కట్టిన బొమ్మలను, జీడిగింజలను తొలగించామని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని,ఏమైనా అపోహలు ఉంటే డయల్ 112కు ఫోన్ చేస్తే,10 నిమిషాల్లో చేరుకొని పరిష్కరిస్తామని ఆయన వివరించారు. ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని తగు సూచనలు ఆయన చేశారు.