ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి

బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్‌: నగర పరిధిలోని వాణిజ్య భవనాల యాజమాన్యాలు ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ టి. వెంకన్న స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భవనాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన ఫైర్‌ సేఫ్టీ పరికరాలను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సూచించారు.

గురువారం హన్మకొండ పరిధిలో ఫైర్‌ సేఫ్టీ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీకి సంబంధించి ఎర్రగట్టుగుట్ట వద్ద ఉన్న షైన్‌ పాఠశాలతో పాటు భీమారంలోని ఎస్‌ఎస్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఫైర్‌ సేఫ్టీ పరికరాలను కమిషనర్‌ పరిశీలించారు. అగ్ని ప్రమాదాల సమయంలో అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయా, నిబంధనలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేశారా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరికరాల ఏర్పాటు, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయి పరిశీలన

అనంతరం వరంగల్‌ పరిధిలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను కమిషనర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బల్దియా ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తిచేసిన 22వ డివిజన్‌లోని సుజిత్‌సింగ్‌నగర్‌, 13వ డివిజన్‌లోని ఎం.హెచ్‌.నగర్‌లో నిర్మించిన సీబిట్‌ కమ్యూనిటీ హాళ్లను పరిశీలించారు. పూర్తయిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు ప్రక్రియలో భాగంగా పనుల నాణ్యత, పురోగతి తదితర వివరాలను ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

19వ డివిజన్‌ పరిధిలోని సొసైటీ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను కూడా కమిషనర్‌ పరిశీలించారు. అలాగే కరీమాబాద్‌, బట్టల బజార్‌ ప్రాంతాల్లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పనుల పురోగతి, నాణ్యత, బిల్లుల చెల్లింపునకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ఫైర్‌ సేఫ్టీ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపు ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టాలని ఆదేశించారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఫైర్‌ అధికారి శంకర్‌ లింగం, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సంతోష్‌ బాబు, డిప్యూటీ ఇంజనీర్‌ రంగారావు, స్టేషన్‌ ఫైర్‌ అధికారి రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు మురళీకృష్ణ, బాబు తదితరులు పాల్గొన్నారు.