పీఎం శ్రీ పాఠశాలల్లో శిక్షణా శిబిరాల పరిశీలన..

వేంసూరు, ఆంధ్రప్రభ: వేసవిలో విద్యార్థులు సరదాగా గడిపేలా, సమయం వృథా కాకుండా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని వేసవి క్యాంపు జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకృష్ణ, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు పీఎం శ్రీ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరాలను సోమవారం వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాలు విద్యార్థుల వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు. క్రీడలు, చిత్రలేఖనం, లెక్కలు, కంప్యూటర్ పరిజ్ఞానం, టైలరింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇండోర్ గేమ్స్ వంటి అనేక అంశాల్లో విద్యార్థులు రాణించేలా శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించి వారి అభిరుచులు, శిక్షణపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అల్పాహారం ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బొంతు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
