పరకాల సీఎం సభకు తరలిన జనం
- డప్పు చప్పుళ్లతో, నృత్యాలతో సభకు తరలివెళ్లిన ప్రజలు
పరకాల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి బహిరంగ సభకు పట్టణం, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం పరకాల పట్టణంలో పలు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరైన సందర్భంగా అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు తరలివెళ్లారు. పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో పట్టణానికి చేరుకున్నారు. అనంతరం బహిరంగ సభ ప్రదేశానికి వెళ్లే రహదారులపై ర్యాలీలుగా కదులుతూ డప్పు చప్పుళ్లతో, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సీఎం సభ నేపథ్యంలో పట్టణంలో అడుగడుగునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పోలీసులు పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు.
