బెంగాల్‌లో సీజేపీ వాలంటీర్ తండ్రి మృతి.. దాడి చేశారంటూ ఆరోపణలు

స్కూళ్ల దుస్థితిపై ప్రశ్నించినందుకే దాడి జరిగిందని సీజేపీ ఆరోపణ..
బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్..
బెంగాల్‌కు పార్టీ బృందం

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో తమ వాలంటీర్ అబ్దుల్ హఫీజ్ అలియాస్ షేక్ రిఖే కుటుంబంపై దాడి జరిగిందని కాక్రోచ్ జంతా పార్టీ (CJP) ఆరోపించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన తండ్రి ఆదివారం మృతి చెందినట్లు పార్టీ కో-కన్వీనర్ అశుతోష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని పరిశీలించేందుకు ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా అబ్దుల్ తన గ్రామంలోని పాఠశాలను సందర్శించినట్లు చెప్పారు.

అబ్దుల్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కొందరు ఆయనపై దాడి చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన తండ్రిపైనా దాడి జరిగిందని రంకా ఆరోపించారు. తీవ్ర గాయాలతో ఆయన తండ్రి మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనకు బీజేపీకి చెందిన వ్యక్తులే కారణమని సీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై స్వతంత్ర ధ్రువీకరణ లభించలేదు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి అబ్దుల్ కుటుంబానికి న్యాయం చేయాలని పార్టీ డిమాండ్ చేసింది.

ఈ ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల అధ్వాన పరిస్థితులపై మాట్లాడినందుకే తమ కార్యకర్త కుటుంబంపై దాడి జరిగిందని ఆరోపించారు. ఘటనపై న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గబోమని ప్రకటించిన సీజేపీ.. తమ సభ్యుల బృందం ఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో ప్రచారం చేపట్టనున్నట్లు సీజేపీ ప్రకటించింది. గ్రామాల్లోని ప్రజలు తమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పరిస్థితులను పరిశీలించాలని, సమస్యలను అధికారులు, సర్పంచ్‌ల దృష్టికి తీసుకెళ్లాలని రంకా పిలుపునిచ్చారు. దేశంలో గత కొన్నేళ్లలో 95 వేల పాఠశాలలు మూతపడ్డాయని సీజేపీ ఆరోపించింది. జార్ఖండ్‌లో నియామక పరీక్షల అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు కూడా తమ మద్దతు కొనసాగుతుందని రంకా తెలిపారు.