ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ లక్ష్యం
గత పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రజలే గుర్తించారు..
కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట
పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి బుద్దా వెంకన్న
ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా..
సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత అవగాహన
టీడీపీలో చేరిన ఐదుగురికి కండువాలు కప్పి ఆహ్వానం
47వ డివిజన్‌లో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వాటిని పరిష్కరించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించడంతో పాటు, ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునేందుకే ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 47వ డివిజన్ టీఎంఎస్‌హెచ్ స్కూల్ ప్రాంతంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాగోతి రామారావు ఆధ్వర్యంలో ఆదివారం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం టీడీపీకి కొత్త కాదన్నారు.
ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుని, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాల ప్రయోజనాలను బుద్ధా వెంకన్న ప్రజలకు వివరించారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.
టీడీపీలోకి ఐదుగురు…
కార్యక్రమంలో పలువురు టీడీపీ విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ఎర్రమల రవి, పగిడిపల్లి పాండు, బత్తుల కోటేశ్వరరావు, సరగడ లక్ష్మి, మద్దెల రాము టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి బుద్ధా వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ అండ్ డెవలప్‌మెంట్ చైర్మన్ దుండి రాకేష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
సంక్షేమ పథకాలతో పాటు స్థానికంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా మరింత మెరుగైన పాలన అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో సారేపల్లి రాధాకృష్ణ, గుర్రంకొండ, పొతినేడి లోకేష్, కట్ట సాంబయ్య, మురికిపూడి కోటేశ్వరరావు, కోరికాని మల్లేశ్వరరావు, రాళ్లపూడి మాధవ, మల్లెపు రాజు, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి పగిడిపల్లి ప్రభుచరణ్‌తో పాటు డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
