వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠ..
- శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ..
- శిఖర కుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో ముగిసిన మహోత్సవాలు
- వేలాది మంది భక్తులకు అన్నదానం
- పూజల్లో పాల్గొన్న దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : పామర్రు మండలం కొమరవోలులోని శ్రీ అమరలింగేశ్వర దుర్గా నాగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిష్ఠా మహోత్సవాలు ఆదివారం వైభవంగా ముగిశాయి. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం దత్తత దేవాలయమైన ఈ ఆలయంలో మూడు రోజులుగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి దత్తత గ్రామమైన కొమరవోలులో దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు డోనార్ స్కీమ్ కింద గ్రామస్థులు, ప్రముఖ దాత కాట్రగడ్డ రమేష్ దంపతుల సహకారంతో స్వామివారి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
శుభ ముహూర్తంలో విగ్రహ ప్రతిష్ఠ..
ఈ నెల 14న ప్రారంభమైన ప్రతిష్ఠా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 7.29 గంటలకు నిర్ణీత శుభ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ శిఖర కుంభాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిష్ఠ అనంతరం స్వామివారి శాంతి కళ్యాణం కన్నులపండువగా జరిగింది. అర్చక పండితులు భక్తులకు వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
వేలాది మందికి అన్నదానం..
ప్రతిష్ఠా మహోత్సవాలను పురస్కరించుకుని కొమరవోలు, పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 4,000 నుంచి 5,000 మంది భక్తులకు దాతల సౌజన్యంతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని అన్నదానంలో పాల్గొన్నారు. ప్రతిష్ఠా మహోత్సవాల్లో పాల్గొన్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఆలయ కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ ఆలయ నిర్మాణ దాత కాట్రగడ్డ రమేష్ దంపతులను దుర్గగుడి తరఫున ఘనంగా సత్కరించారు.
శాలువా, అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవో మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ పట్ల నిబద్ధతతో కాట్రగడ్డ రమేష్ దంపతులు తమ సొంత గ్రామంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రతిష్ఠా మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. భక్తి శ్రద్ధలతో చేపట్టిన ఈ మహత్కార్యం ద్వారా గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల మన్ననలు పొందారని ప్రశంసించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైదిక కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దేవస్థాన అధికారులు, వేలాది మంది గ్రామస్థులు, భక్తులు పాల్గొన్నారు.
