తల్లిదండ్రులు.. పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి

తల్లిదండ్రులు.. పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు ఏప్రిల్ 23 నుండి వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు చెరువు కుంటల్లో ఈతకొట్టేప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే విషాదంగా మారే ప్రమాదం ఉందని స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్ రావు, ఎంఈఓ కొమరం శాంతారావు శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాల్లకు వేసవి సెలవులు ప్రకటించడంతో, సెలవులు పిల్లలకు ఆటవిడుపుగా మారాయని గ్రామాల్లో చాలా వరకు యువత, పిల్లలు బావులు, కుంటలు చెరువుల్లో ఈతకు వెళ్తుంటారని, కొత్తగా ఈత నేర్చుకోవాలన్నా ఉష్ణోగ్రత వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాగులు చెరువుల్లో ఈత కొట్టాలన్న ఉత్సాహంతో ఉన్న పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నీటిలోకి దిగితే ప్రమాదాల బారినపడే అవకాశం ఉందన్నారు. ఈతకొట్టడం పై పిల్లలకు పెద్దగా అవగాహన ఉండదని అలాంటి సమయంలో ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటారని గుర్తు చేశారు. గతంలో పలు గ్రామాల్లో వేసవి సెలవుల్లో చెరువులు, కుంటల్లోకి ఈతకు వెళ్లి మృతి చెందిన సంఘటనలు కోకొల్లలున్నాయన్నారు.
గ్రామాల్లో ఈతరాని పిల్లలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నీటిలో మునిగిప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇదిలా ఉండగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఖాళీ సమయాల్లో ఎక్కువగా మొబైల్ వినియోగం తగ్గించేందుకు తల్లిదండ్రులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు మొబైల్ ప్రమాదం పొంచి ఉందని గమనించిన తల్లిదండ్రులు వేసవి కాలంలో ప్రత్యేకంగా స్పెషల్ కోర్సుల శిక్షణలకు పంపించడం మంచిది అన్నారు. ఏది ఏమైనా ఏప్రిల్ 24 నుండి జూన్ 13 వరకు 50 రోజుల పాటుగా పిల్లలను క్రమశిక్షణతో ప్రోత్సహించి సన్మార్గంలో నడిపించేలా బాధ్యతగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులను కోరారు.
