యువతలో పెరుగుతున్న సైబర్ మోసాలు
యువతలో పెరుగుతున్న సైబర్ మోసాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ‘నువ్వే నా ప్రపంచం’ అని సోషల్ మీడియాలో చెప్పుకుని ఊహల్లో తేలినవాళ్లే… పెళ్లి తర్వాత హంతకులుగా మారుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అరచేతిలోని స్మార్ట్‌ఫోన్, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ‘హాయ్’ మెసేజ్‌లు… ఒక్కసారి ఓకే చెప్పి టచ్‌లోకి వెళ్తే ఇల్లు, జీవితం తారుమారవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా చెప్పే తీయటి మాటలు నమ్మి, కుటుంబ నేపథ్యం తెలియకుండానే చేసుకునే పెళ్లిళ్లు… కొద్ది రోజుల్లోనే అనుమానాలు, విభేదాలతో పాడవుతున్నాయి. కొన్నిచోట్ల ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం, తల్లిదండ్రులనే శత్రువులుగా చూడడం వంటి ప్రమాదకర ధోరణి పెరుగుతోంది.
డిజిటల్ ‘డెత్ ట్రాప్’లో చిక్కుకుంటున్న బాధితుల్లో 70 శాతం మంది 30 ఏళ్లలోపు వారే. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికల ప్రకారం, దేశంలో జరిగే సైబర్ నేరాల్లో 15 శాతం ప్రేమ, పెళ్లి పేరుతో జరిగే మోసాలే అని తేలింది. తెలంగాణలో మహిళలపై నమోదవుతున్న వేధింపుల కేసుల్లో 30 శాతం పైగా సోషల్ మీడియా పరిచయాల వల్లనే జరుగుతున్నాయి.
ఘటనల ఉదాహరణలు
ఇన్స్టాగ్రామ్ ద్వారా వినయ్, జ్యోతి పరిచయం పెరిగి ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే అదే సోషల్ మీడియా వారి మధ్య విభేదాలకు దారితీసింది. చివరికి వినయ్, జ్యోతిని హత్య చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చైతన్యపురిలో జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇషికకు ఫేస్బుక్ ద్వారా నీరజ్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత వరకట్న వేధింపులు పెరగడంతో, ఇషిక ఆత్మహత్యకు పాల్పడింది.
డిగ్రీ చదువుతున్న కీర్తి రెడ్డికి సోషల్ మీడియాలో శశికుమార్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఈ సంబంధాన్ని వ్యతిరేకించిన తల్లిని ఇద్దరూ కలిసి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
సోషల్ మీడియా నుంచి డెత్ ట్రాప్ వరకు
సోషల్ మీడియా పరిచయాలు ప్రేమలు, పెళ్లిళ్లుగా మారుతున్నాయి. కానీ అవే కొన్నిసార్లు ప్రాణాలను తీసే స్థాయికి చేరుతున్నాయి. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. తెలియని వ్యక్తులతో స్నేహాలు ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నాయి.
డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మౌనికను, రవీంద్ర అనే వ్యక్తి తన ఇంటికి పిలిచి హత్య చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి దాచిన ఈ సంఘటన సమాజాన్ని కుదిపేసింది.
అప్రమత్తంగా ఉండాలి
స్మార్ట్‌ఫోన్ వినియోగం ఆడపిల్లలకు ప్రమాదంగా మారుతోంది. ఫేక్ అకౌంట్లతో అందమైన ఫోటోలు పెట్టి యువతులను ఆకర్షిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపించిన తర్వాత వాటిని బ్లాక్‌మెయిల్‌కు వాడుతున్నారు. ఈ విషయాలు ఇంట్లో చెప్పలేక బాధితులు మానసికంగా కుంగిపోతున్నారు. పెళ్లికి ముందు మంచివారిలా కనిపించిన కొందరు, తర్వాత అసలు స్వరూపం చూపిస్తున్నారు. కొన్నిసార్లు హత్యల వరకూ వెళ్తున్నారు.
సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్టులు వెంటనే అంగీకరించకూడదు. వ్యక్తిగత సమాచారం అపరిచితులతో పంచుకోకూడదు. సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు లేదా షీ టీమ్స్‌కు తెలియజేయాలి. అవసరమైతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. 1930 లేదా 100కు కాల్ చేసి సహాయం పొందవచ్చు.
— సజ్జనార్, సీపీ, హైదరాబాద్
