ఆయిల్ పామ్ పంట పై రైతులకు అవగహన సదస్సు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం కోనా సమందర్ గ్రామంలోనీ రైతు వేదికలో మండల ఏవో టి.రమ్యశ్రీ,హార్టికల్చర్ అధికారి రాజు,అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారి శ్యామ్,ఆయిల్ పామ్ కంపెనీ అధికారి మధు రైతులకు ఆయిల్ పామ్ పంట సాగు పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగు చేయడానికి పలు రకాల సబ్సిడీలతో సాగును ప్రోత్సహిస్తుందని, ఈ పంటను ఒకసారి నాటితే 4 సంవత్సరాల తర్వాత నిరంతర ఆదాయాన్ని 30 సంవత్సరాల పాటు ఇస్తుందని, కోతులు ముట్టని, పందుల బెడద, దళారుల మోసం మరియు దొంగల బెడద, తక్కువ కూలీలు అవసరమయ్యే పంట ఆయిల్ పామ్ పంట అని తెలిపారు.

రైతులు ఒక ఎకరం వరి పండించే నీటితో 3 ఎకరాల ఆయిల్ పామ్ పంటను సాగు చేసుకొని అధిక ఆదాయం రాబట్ట వచ్చని తెలిపారు.ఈ పంటకు ఎన్ఎంఈవో వోపి స్కీమ్ కింద మొక్కలకు 90 శాతం రాయితీ,రైతు కేవలం ఒక ఎకరానికి రూ.1,000 చొప్పున జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి నిజామాబాద్ పేరిట డీడీ చెల్లిస్తే 50 మొక్కలు ప్రీ యూనిక్ కంపెనీ వారిచే అందిస్తామని తెలిపారు.

ఆయిల్ పామ్ మధ్యలో అంతర పంటల సాగు (మొక్కజొన్న, జొన్న, పసుపు, కూరగాయలు, సోయా ) వేసినందుకు గాను ఎకరానికి రూ. 4200 చొప్పున రైతు ఖాతాలో సంవత్సరానికి ఒకసారి జమ చేస్తున్నామని తెలిపారు.ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు చిన్న, సన్నకారు,ఐదెకరాల లోపు ఉన్నవారికి 90శాతం రాయితీ,ఎస్సీ,ఎస్టీ రైతులైతే 100 శాతం రాయితీ,5 ఎకరాల మీదా సాగు చేసేవారికి 80 శాతం రాయితీ కింద డ్రిప్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply