Nizamsagar Lands | ప్రభుత్వ శాఖలకే భారీగా భూముల కేటాయింపు

Nizamsagar Lands | ప్రభుత్వ శాఖలకే భారీగా భూముల కేటాయింపు

Nizamsagar Lands | నిజాంసాగర్ భూములపై యథేచ్ఛ కబ్జాలు
తగ్గిపోతున్న నీటి నిల్వ సామర్థ్యం
ప్రభుత్వ శాఖలకే భారీగా భూముల కేటాయింపు
భూసర్వేలు లేకపోవడంతో పెరుగుతున్న గందరగోళం
రైతాంగంలో ఆందోళన.. స్పందిస్తుందా ప్రభుత్వం?

హైదరాబాద్, ఆంధ్రప్రభ: భూ బకాసురులు విజృంభిస్తున్నారు. ఇప్పటివరకు చెరువులనే మింగేస్తున్నారనుకుంటే… ఇప్పుడు జలాశయాలనూ కాజేస్తున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని వ్యవసాయ భూములు క్రమేణా కనుమరుగవుతున్నాయి. కాకతీయుల నుంచి నిజాం రాజుల వరకు నిర్మించిన జలాశయాల భూములపై కచ్చితమైన భూసర్వేలు లేకపోవడం, క్రమేణా విస్తరిస్తున్న పట్టణీకరణతో పంటభూములు మాయమైపోతున్నాయి. కబ్జాకు గురవుతున్న జలాశయాల భూముల్లో నిజాంసాగర్ ముందువరుసలో ఉందని తెలుస్తోంది. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించిన నిజాంసాగర్ భూములు ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి.

యథేచ్ఛగా సాగిపోతున్న కబ్జాపర్వం

క్రమేణా దిగమింగుతున్నారు. 1923 – 1931లో నిర్మించిన నిజాంసాగర్ తొలుత 29.72 టీఎంసీల సామర్థ్యం ఉండగా, ప్రాజెక్టులో పూడిక చేరడంతో 1976 నాటికి 17.8 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం పూడికతో పాటు పేట్రేగిన అక్రమార్కుల కారణంగా నీటి నిల్వ సామర్థ్యం కోల్పోయి 15 టీఎంసీలకు పడిపోయింది. 1976 నుంచి ఇప్పటివరకు నిజాంసాగర్ జలాశయం నిర్మాణ సమయంలో సర్వేలు సరిగా చేయకపోవడంతో ఏమేరకు సాగర్ గర్భం మాయమైందో అధికారుల దగ్గర సరైన రికార్డులు లేకపోవడం గమనార్హం.

ప్రాజెక్టు నిర్మాణం కోసం నాడు నిజాం రాజు ఆదేశాల మేరకు 40 గ్రామాలకు చెందిన భూముల్లో ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు కోసం 40 గ్రామాల ప్రజలు చేసిన భూముల త్యాగం ప్రస్తుతం భూ బకాసురులకు వరంగా మారింది. సర్వే నంబర్ 560లో సుమారు 400 ఎకరాల భూమి జలవనరుల శాఖకు ఉండేది. ఆ మొత్తంలో కొంత భూమిని వివిధ ప్రభుత్వ శాఖలకు అధికారులు కేటాయించారు. కాలువలు, ఇతర అవసరాలకు పోను 135 ఎకరాల మిగులు భూమి ఉంది. ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. పలువురు ప్రభుత్వ పెద్దల సహాయంతో భూములను క్రమేణా కబ్జా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ భారతిలోనూ కేటాయింపుల వివరాలు

నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన స్థలాల్లో 9 మందికి 21.17 ఎకరాల భూమిని కేటాయించినట్లు భూభారతి పోర్టల్‌లో ఉంది. కొంతమందికి 5 గుంటల్లోపు, మరికొందరికి 6 ఎకరాల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు భూముల్లో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు? ఎంత మిగిలింది? అనే సమాచారం సంబంధిత శాఖల దగ్గర లభ్యం కావడం లేదు.

అక్రమంగా కనుమరుగవుతున్న భూములతో పాటు నిజాంసాగర్ భూముల్లోనే ప్రభుత్వ కార్యాలయాలకు భూములు కేటాయించడాన్ని రైతాంగం తప్పుబడుతోంది. సర్వే 598లో పోలీస్ స్టేషన్‌కు 3 ఎకరాలు, వైర్‌లెస్ కార్యాలయానికి 3.5 ఎకరాలు, తహసీల్దార్ కార్యాలయానికి 5 గుంటలు, బస్ స్టేషన్‌కు 2.4 ఎకరాలు, ట్రాన్స్‌కో కార్యాలయానికి 0.25 ఎకరాలు, జవహర్ నవోదయ విద్యాలయానికి 30 ఎకరాలు, అటవీ ప్లాంటేషన్‌కు 6 ఎకరాలు కేటాయించారు. ఒకవైపు కబ్జా, మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు భూముల బదలాయింపు జరుగుతుండటంతో విస్తీర్ణం కాస్తా కుచించుకుపోతోంది. జలాశయాల భూముల ఆక్రమణలపై ప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply