నియంత్రణ కోల్పోయిన ట్రాక్టర్ బోల్తా..
నియంత్రణ కోల్పోయిన ట్రాక్టర్ బోల్తా..
వాహనం కింద ఇరుక్కుని రైతు మృతి
నకరికల్లు, ఆంధ్రప్రభ: నకరికల్లు మండల పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంకొండ మండలం పాపయ్యపాలెం గ్రామానికి చెందిన అక్కల పెద్దరామిరెడ్డి (40), తండ్రి వెంకటరెడ్డి, ఉదయం సుమారు 7.15 గంటలకు తన ట్రాక్టర్ను నడుపుకుంటూ అడ్డరోడ్ నుంచి నరసరావుపేట వైపు వెళ్తున్నాడు.
ఈ క్రమంలో నకరికల్లు మండల పరిధిలో సుమారు 2.5 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం ట్రాక్టర్ ప్రమాదవశాత్తు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న కాలువలో బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన పెద్దరామిరెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న నకరికల్లు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ట్రాక్టర్ కింద చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అక్కల పెద్దరామిరెడ్డి అకాల మరణంతో పాపయ్యపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
