మండల స్థాయిలో ఇక ప్రజావాణి..
- ఆగస్టు 17 నుంచి ప్రతి సోమవారం నిర్వహణ..
- జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి: ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ఇకపై ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆగస్టు 17 నుంచి మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మండల ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను ప్రజావాణిలో అందజేయవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం మండల స్థాయిలోనే ప్రజావాణి నిర్వహిస్తున్నందున సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. మండల స్థాయిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు, వినతులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిలో అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.
