జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం

  • అణచివేతపై అక్షర పోరాటం.. హక్కుల కోసం ఒక్కటైన కలం

కర్నూలు, ఆంధ్రప్రభ : జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రత కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ (ఏపీఎంఎఫ్‌) నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, మీడియా ప్రతినిధులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. పత్తికొండ నియోజకవర్గ ఏపీఎంఎఫ్‌ కమిటీ నిర్మాణ మహాసభ కర్నూలు జిల్లా కన్వీనర్‌ ఎం. సాయి కుమార్‌ నాయుడు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నూతన కమిటీని ప్రకటించారు. ఏపీఎంఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి. మద్దిలేటి, జిల్లా కన్వీనర్‌ ఎం. సాయి కుమార్‌ నాయుడు, జిల్లా కో-కన్వీనర్లు ఆర్‌. బాలకృష్ణ, కె. రంగనాథ్‌, బి. రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పత్తికొండ నియోజకవర్గ ఏపీఎంఎఫ్‌ అధ్యక్షుడిగా మద్దికేర శేఖర్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడిగా సి. సురేష్‌, కార్యదర్శిగా వీవీ నాయుడు, కోశాధికారిగా విష్ణువర్ధన్‌ గౌడ్‌ను నియమించారు. మండల ఉపాధ్యక్షులుగా బి. రంగన్న, రాం ప్రతాప్‌ గౌడ్‌, సి. రాము, పి. రాజు, మహేష్‌, వి. నాగార్జున, రామాంజనేయులను నియమించారు. నూతన కమిటీ సభ్యులను సహచర పాత్రికేయులు అభినందించారు. జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని నాయకులు కోరారు.

దశాబ్దాలుగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల్లో చాలామందికి సొంత ఇల్లు లేకపోవడం ఆందోళనకరమన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్ల స్థలాలు లేదా గృహ నిర్మాణానికి అవసరమైన సహకారం అందేలా సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదని, వృత్తిపరమైన హక్కులు, ప్రభుత్వ సమాచార వ్యవస్థకు ప్రాప్యత, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.

అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు పారదర్శకంగా అక్రిడేషన్‌ లభించేలా నిబంధనలు అమలు చేయాలని, చిన్న పత్రికలు, స్థానిక మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్టులు క్షేత్రస్థాయిలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు చోటుచేసుకున్నప్పుడు తక్షణమే స్పందించేలా భద్రత, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దాడికి గురైన జర్నలిస్టులకు న్యాయ సహాయం, పోలీసు రక్షణ, సంబంధిత అధికారులతో సమన్వయం వంటి అంశాల్లో యూనియన్‌ అండగా నిలవాలని నిర్ణయించారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతోపాటు వృత్తి విలువలను కాపాడటం కూడా ముఖ్యమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం, వార్తల్లో వాస్తవ నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వడం, వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఉండటం, బాధితుల గోప్యతను గౌరవించడం, ఆరోపణలను నిర్ధారిత వాస్తవాలుగా ప్రచురించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించడం జర్నలిస్టుల విధులని తెలిపారు. ఒక్కో జర్నలిస్టు తన సమస్యను వ్యక్తిగతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం కంటే, అందరూ ఒకే వేదికపైకి వచ్చి సమష్టిగా సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్‌, దాడులపై తక్షణ స్పందన, న్యాయ సహాయం, వృత్తిపరమైన శిక్షణ, ఆరోగ్య బీమా వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా, పిల్లల విద్యకు సహాయం, వృద్ధాప్యంలో భరోసా, గృహ వసతి వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని సమావేశం కోరింది. పత్తికొండ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ సమన్వయం చేసుకుని వారి సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు నూతన కమిటీ పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జర్నలిస్టుల బాధ్యత కాగా, జర్నలిస్టుల హక్కులను కాపాడటం యూనియన్‌ బాధ్యత అని సమావేశం అభిప్రాయపడింది. ఈ రెండు బాధ్యతలు సమన్వయంతో సాగినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొంది.