మైనర్‌ యువకులకు వాహనాలు ఇవ్వొద్దు

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు.. నిబంధనలు పాటించాలి

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్‌పల్లి ఎస్‌ఐ చిర్ర సతీష్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాటి హనుమాన్‌ ఆలయం వద్ద ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా హెడ్‌ కానిస్టేబుల్‌ అర్జున్‌ మాట్లాడుతూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానాలు విధించినట్లు తెలిపారు.

మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, నిబంధనలు ఉల్లంఘించి డ్రైవింగ్‌ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు నూతన చట్టాలను అనుసరిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు.

ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు వాహనాలకు సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకుని ప్రయాణించాలని తెలిపారు. వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే వాహనం నడిపిన వారితో పాటు వాహనం ఇచ్చిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మైనర్‌ యువకులకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.

18 సంవత్సరాలు నిండిన, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన యువకులు మాత్రమే వాహనాలు నడపాలని, లైసెన్స్‌ లేని వారు వాహనాలు నడపకూడదని సూచించారు. వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు లేని 12 వాహనాలకు మొత్తం రూ.5,580 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ తనిఖీల్లో సిబ్బంది లింబాద్రి, శ్రీనివాస్‌, అష్రాఫ్‌ తదితరులు పాల్గొన్నారు.