అల్లా బకాష్పై పీడీ యాక్ట్ నమోదు..
- పునరావృత నేరాలతో శాంతిభద్రతలకు విఘాతం..
- కడప సెంట్రల్ జైలుకు తరలింపు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లా పరిధిలో పలు నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న అల్లా బకాష్ అలియాస్ షేక్ బకాష్ (36)పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. వైఎస్ కాలనీ, ప్రశాంత్‌నగర్‌కు చెందిన అల్లా బకాష్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. అల్లా బకాష్ పలుమార్లు నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఎన్డీపీఎస్ కేసుల్లోనూ పట్టుబడ్డాడని ఎస్పీ తెలిపారు.
పోలీసులు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసం నేరాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమించాడని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలతో యువతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అతనిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సాధారణ చట్టపరమైన చర్యలతో అతని నేర కార్యకలాపాలను అరికట్టడం సాధ్యం కాకపోవడంతో పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్‌కు ఎస్పీ చేసిన సిఫారసు మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజా శాంతిభద్రతలను కాపాడటం, నేరపూరిత కార్యకలాపాలను అరికట్టడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. యువత అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. మోసాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై సాధారణ చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఎస్పీ సూచించారు. ప్రజలను ప్రలోభపెట్టడం, బెదిరించడం, గొడవలకు పాల్పడటం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
