Delhi | రేపు సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్

న్యూఢిల్లీ : పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రేపు మాక్‌డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో గురువారం మాక్‌డ్రిల్ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు సాయంత్రం సివిల్ డిఫెన్స్ మాక్‌డ్రిల్ ఏర్పాటు చేయనున్నారు.

మాక్ డ్రిల్‌లో చేపట్టే ముఖ్యమైన అంశాలు:
శత్రు దేశాల నుంచి ఆకస్మిక దాడులు జరిగితే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిందే ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై దృష్టి సారించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లను మోగించడం, భారత వైమానిక దళంతో హాట్‌లైన్/రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలను క్రియాశీలం చేయడం, కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, సిబ్బందిని నియమించడం వంటివి ఇందులో ఉన్నాయి.

పౌరులు, విద్యార్థులకు ఆత్మరక్షణ పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసే ‘క్రాష్ బ్లాక్ అవుట్’ చర్యలు చేపట్టడం, కీలకమైన ప్లాంట్లు/సంస్థాపనలను శత్రువుల కంట పడకుండా మభ్యపెట్టడం (కామోఫ్లేజింగ్) వంటివి కూడా ఈ డ్రిల్స్‌లో భాగం. పౌర రక్షణ ప్రణాళికలు, తరలింపు ప్రణాళికలను ఆచరణలో పెట్టి పరీక్షించడం, బంకర్లు, కందకాలను శుభ్రపరచడం కూడా ఈ ప్రక్రియలో ఓ భాగమేనని అధికారులు తెలిపారు.

Leave a Reply