మునుగోడులో ఎవరికీ కంటి సమస్యలు ఉండొద్దు

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధపడకూడదన్నదే తన లక్ష్యమని, ప్రతి ఒక్కరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటుప్పల్‌ లో తన మాతృమూర్తి ‘కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్’, ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 15వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఇప్పటివరకు 14 విడతల్లో 10,444 మందికి కంటి పరీక్షలు చేసి, 2,325 మందికి ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేయించామని, 4,557 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేశామని తెలిపారు.

భవిష్యత్తు లో 10 వేల మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తాజా 15వ విడత శిబిరంలో 1,210 మందికి పరీక్షలు నిర్వహించగా, 208 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. నియోజకవర్గ ప్రజలకు పెద్దకొడుకులా అండగా ఉంటానని, ధైర్యంగా వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఉచిత శిబిరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ తో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.