Minister | రైతుల ఖాతాల్లో రూ.11,050 కోట్లు జమ

Minister | రైతుల ఖాతాల్లో రూ.11,050 కోట్లు జమ
Minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా కొనసాగిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ధాన్యం సేకరణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13వేల వాహనాలను అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. సేకరణ ప్రక్రియలో దాదాపు 2 లక్షల మంది సిబ్బంది పాల్గొంటున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు 20.86 కోట్ల గన్నీ బ్యాగులను పంపిణీ చేశామని వెల్లడించారు.
ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాల్లో రూ.11,050 కోట్లను జమ చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం తరలింపు, నిల్వ, చెల్లింపుల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ధాన్యం సేకరణలో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులపై ఆధారపడాల్సి వస్తోందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బెంగాల్ ఎన్నికల కారణంగా కొంతమంది కార్మికులు స్వస్థలాలకు వెళ్లడంతో వారి రాక ఆలస్యమైందని వివరించారు.
మద్దతు ధర చెల్లింపుల కోసం తమ ప్రభుత్వం రూ.49వేల కోట్లు వెచ్చించిందని, గత ప్రభుత్వం రూ.10వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ధృవీకరించిందని తెలిపారు.
గత బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన కొనుగోళ్ల కంటే ప్రస్తుతం అధికంగా ధాన్యం సేకరిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూనే అదనంగా కొనుగోళ్లు చేపట్టామని చెప్పారు. ఈ ప్రక్రియ కోసం రూ.16,479 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు తీసుకొచ్చే చివరి గింజ వరకు కొనుగోలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
