రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు

  • ధాన్యం తరలింపులో సమన్వయంతో పనిచేయాలి
  • కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు తప్పనిసరి
  • సమావేశానికి గైర్హాజరైన అధికారులకు మెమోలు జారి
  • రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : రైతు కష్టానికి తగిన గౌరవం దక్కేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రైతులు, కొనుగోలు దారులు, రైస్ మిల్లర్లు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, ఎవరూ ఎవరినీ బతిమాలుకునే పరిస్థితి రాకుండా జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు.

సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సుఖజీవన్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో రబీ 2025–26 సీజన్‌కు సంబంధించిన వరి, మొక్కజొన్న కొనుగోళ్ల ఏర్పాట్లపై జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, డీసీఓలు, డీఆర్‌డీఓలు, ఏపీఎంలు, వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లైస్, మార్కెటింగ్, రవాణా, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, లారీ కాంట్రాక్టర్లు, ఏఎంసీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. సమావేశానికి హాజరుకాని అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

రైతులకు అన్యాయం జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మంత్రి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రవాణా కాంట్రాక్టర్లు సమయానికి లారీలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని అన్నారు.

వ్యవసాయ అధికారులు క్లస్టర్ స్థాయిలో పంటల వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించాలని, ముందస్తు ప్రణాళికతో పనిచేస్తే కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్‌లో 1,87,418 ఎకరాల్లో సుమారు 1.20 లక్షల మంది రైతుల నుంచి 4,44,033 మెట్రిక్ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు, జాప్యాలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులు ధాన్యంతో కేంద్రాలకు వచ్చిన తర్వాత రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి రాకూడదని అధికారులను ఆదేశించారు.

రైతులకు తాగునీరు, షెడ్లు, గన్నీ బ్యాగులు, హమాలీలు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ముఖ్యంగా తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయరాదని స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఈ సీజన్‌లో సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చిందని, అందుకు అనుగుణంగా గన్నీ బ్యాగులు సరఫరా చేసి కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించాలని అధికారులను కోరారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని సూచించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పొద్దుతిరుగుడు పంట దిగుబడి అధికంగా ఉందని, ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.

సమావేశంలో అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వహణ, గన్నీ బ్యాగుల సరఫరా, ధాన్యం నిల్వ, రవాణా, తేమ శాతం నిర్ధారణ, రైతులకు చెల్లింపుల ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

Leave a Reply