శ్రీ కాలభైరవుడిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ దంపతులు..

కుమార్తె సుస్మితా పటేల్, అల్లుడు అభిలాష్ పటేల్‌లతో కలిసి ప్రత్యేక పూజలు…


కార్పొరేషన్, ఆగస్ట్ 12 ఆంధ్రప్రభ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొండా మురళీధర్ రావు లు కూతురు అల్లుడు తో కలిసి వరంగల్ జిల్లాలోని నాంపల్లి దేవిబాగ్ లోని ప్రసిద్ధ శ్రీ కాలభైరవ స్వామి(భైరవ బాబా మందిర్) ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కుమార్తె సుస్మితా పటేల్, అల్లుడు అభిలాష్ పటేల్ లతో కలిసి కుటుంబ సభ్యులంతా భక్తిశ్రద్ధలతో కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… కాలాన్ని నియంత్రించే దైవస్వరూపంగా హిందూ సంప్రదాయంలో కాలభైరవ స్వామికి విశిష్టమైన స్థానం ఉందని తెలిపారు. పరమశివుని ఉగ్రరూపంగా, క్షేత్రపాలకుడిగా, ధర్మ పరిరక్షకుడిగా భక్తులు కాలభైరవుణ్ణి కొలుస్తారని అన్నారు. కాలభైరవ స్వామిని ఆరాధించడం ద్వారా భయాలు తొలగి, ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మిక బలం చేకూరుతాయని భక్తుల విశ్వాసమని వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. ఆలయాల ఆధ్యాత్మిక వైభవాన్ని, పురాతన సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు.ఆలయ అర్చకులు మంత్రి సురేఖ దంపతులు, కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు.