శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు
తెలంగాణకు మోదీ వరాల మాల
రూ. 9600 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
పీఎం మిత్రా పార్క్ జాతికి అంకితం
జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్‌కు భూమి పూజ
జాతీయ రహదారి-167 విస్తరణకూ శ్రీకారం
సింధూ ఆస్పత్రిని ప్రారంభించిన ప్రధాని
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలోని పలు అభివృద్ధి కార్యక్యమాలకు శ్రీకారం చుట్టారు. హైటెక్స్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడమే కాకుండా మరికొన్నింటిని లాంఛనంగా ప్రారంభించారు
పీఎం మిత్రా పార్క్ (కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్): సుమారు రూ. 1,700 కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి పీఎం మిత్రా పార్కును ప్రధాని ప్రారంభించారు. “ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారిన్” అనే 5F దార్శనికతతో ఇది రూపుదిద్దుకుంది.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా..
సంగారెడ్డి జిల్లాలో 3,245 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2,350 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌కు మోదీ భూమిపూజ చేశారు.. ఇది భవిష్యత్తులో రూ. 10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి కల్పించనుంది.
జాతీయ రహదారి-167 విస్తరణ
హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గూడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారికి ప్రధాని పునాది రాయి వేశారు. రూ. 3,175 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు వల్ల ప్రయాణ సమయం 90 నిమిషాలు తగ్గుతుంది.
రైల్వే మౌలిక సదుపాయాలు
రూ. 1,535 కోట్లతో కాజీపేట-విజయవాడ మధ్య 118 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రైల్వే లైన్లను , కాజీపేట వద్ద వ్యూహాత్మక రైల్ బైపాస్ లైనును జాతికి అంకితం చేశారు.
ఇండియన్ ఆయిల్ మల్కాపూర్ టెర్మినల్
సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో 1.65 లక్షల కిలో లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ఇండియన్ ఆయిల్ మల్కాపూర్ టెర్మినల్ కూడా ఆయన ప్రారంభించారు. ఈ టెర్మినల్ ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చనుంది.
సింధూ ఆస్పత్రి ప్రారంభం
ఇక మాదాపూర్ లో నిర్మించిన కేన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించే 1,500 పడకల అత్యాధునిక క్వాటర్నరీ కేర్ సింధు ఆసుపత్రిని ప్రధాని ప్రారంభించారు. ఇందులో 29 ఆపరేషన్ థియేటర్లు, 33 పైగా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉంటాయి.
మరికొద్దిసేపట్లో బహిరంగ సభ
కాగా, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభకు సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజలు హాజరవుతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
