మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
మెరుగైన సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలకు నియామక పత్రాలను అందచేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ
పటమట, ఆంధ్రప్రభ : అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాలుగా నియామకమైన వారు చక్కగా పనిచేసి కూటమి ప్రభుత్వానికి మంచి తీసుకురావాలని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలో నియమితులైన అంగన్‌వాడి టీచర్లు, అంగన్‌వాడీ ఆయా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందచేసే కార్యక్రమం పటమట అశోక్ నగర్‌లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అతిధులుగా హజరై వీరికి నియామకపత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయిస్తున్నామని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పనతో పాటుగా కేంద్రాల్లో ఉన్న ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని సిబ్బంది బాగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ చాలా అస్థవ్యస్థంగా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించి, మరమ్మత్తులు చేయించామన్నారు.
ఇప్పుడు నియామకం అయిన అంగన్‌వాడీ కేంద్రాల్లోని సిబ్బంది బాగా పని చేస్తూ భవిష్యత్తుల్లో మరింత ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళాలని గద్దె అనురాధ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనతో పాటుగా గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని కూడా తమ ప్రభుత్వం అందచేస్తోందన్నారు. చిన్నారులకు సైతం ఏ విధమైన జబ్బులు రాకుండా ముందస్తుగా టీకాలను అందజేస్తోందని చెప్పారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పుడు నియామకం అయిన 17 మంది అంగన్‌వాడీ సిబ్బందీ ప్రభుత్వ సేవలను లబ్ధిదారులకు సకాలంలో అందచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ముమ్మనేని ప్రసాద్, దయాల శిరీషా గాంధీ, కొత్తపల్లి రమేష్, మల్లెల రామకృష్ణ, కోనేరు రాజేష్, నాదెళ్ళ రాజేష్, కొక్కిరి తిరుపతి, రాధారపు యల్లబాబు, గళ్లా శ్రీను, శింగంశెట్టి రమేష్, పడాల గంగాధర్, బజ్జలకూర అజయ్ కుమార్, రాయి రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
