may3Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may3Sunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

may3Sunday2026 | నేటి జీవితంలో ఒత్తిడి, ఆందోళనల మధ్య కనుమరుగవుతున్న నవ్వు
ప్రపంచ నవ్వుల దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశం
నవ్వు వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు
సోషల్ మీడియా ఎమోజీలు ఎక్కువ… నిజ జీవితంలో నవ్వులు తక్కువ
మనల్ని కాపాడేది మందు కాదు… మనసారా నవ్వే దివ్యౌషధం

may3Sunday2026
may3Sunday2026

may3Sunday2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : “నవ్వు నాలుగు విధాల మేలు” అన్నారు ప్రముఖ దర్శకులు జంధ్యాల. కానీ నేటి కాలాన్ని చూస్తే నవ్వు అనేది నాలుగు కాదు… నలభై విధాల మేలు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే మనిషి జీవితం ఇప్పుడు పరుగుల పందెం. ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు పోటీ, ఒత్తిడి, ఆందోళన, ఆరాటం… ఇవే.
అన్నిట్లో గెలవాలి, ముందుండాలి, ఇంకొంచెం సంపాదించాలి, ఇంకా ఎత్తుకు వెళ్లాలి… ఇవే ఆలోచనల మధ్య పరిగెత్తడమే తప్ప జీవితాన్ని ఆస్వాదించడమే మరిచిపోతున్నాం.

ఈ తరం మనుషుల ముఖాల్లో చిరునవ్వు కంటే టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కనిపించని ఒత్తిడితోనే జీవిస్తున్నారు. విద్యలో పోటీ, ఉద్యోగంలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, సామాజిక పోలికలు… ప్రతి దశలో మనసును బరువెక్కించే పరిస్థితులే. ఇలా నిత్యం ఒత్తిడిలో జీవిస్తున్న మనిషికి నిజంగా అవసరమైన ఔషధం మందు కాదు… ఒక మంచి నవ్వు.

మే 3న ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుకోవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం కూడా ఇదే. నవ్వు ద్వారా లభించే ఆనందాన్ని, సమస్యల పట్ల, చుట్టూ ఉన్న మనుషుల పట్ల సానుకూల దృక్పథాన్ని, మానసిక ప్రశాంతతను పెంపొందించడం.
నవ్వు అనేది మానసికారోగ్యానికి సంకేతం.
మనిషి హృదయం తేలిక పడే అద్భుతం నవ్వు.
మనసులోని భారాన్ని కొద్దిసేపైనా మర్చిపోయే అవకాశం నవ్వు.

వైద్యపరంగా కూడా నవ్వుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. నవ్వినప్పుడు శరీరంలో ఎండార్ఫిన్స్ అనే సంతోష హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. రక్తపోటు నియంత్రణలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే చాలామంది వైద్యులు కూడా “రోజుకు కొద్దిసేపైనా మనసారా నవ్వండి” అని సూచిస్తుంటారు.

ఇప్పటి కాలంలో సోషల్ మీడియాలో నవ్వుతున్న ఎమోజీలు ఎక్కువ… నిజ జీవితంలో నవ్వులు తక్కువ. మనుషులు దగ్గరగా ఉన్నా మనసులు దూరమవుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చొని సరదాగా మాట్లాడే సమయం తగ్గిపోతోంది. స్నేహితులతో కలిసి మనస్పూతిగా నవ్వుకునే సందర్భాలు అరుదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నవ్వును తిరిగి జీవితంలోకి తీసుకురావడం అవసరం.

నవ్వు అంటే సమస్యలు లేవని కాదు… సమస్యల మధ్య కూడా మనసును నిలబెట్టుకోవడం. కష్టాల్లోనూ చిరునవ్వు నిలబెట్టుకోవడం ఓ గొప్ప శక్తి.

మన పెద్దలు “నవ్వు ముఖానికే కాదు, మనసుకీ అందం” అని చెప్పేవారు. అది నిజమే. నవ్వు మనిషిని అందంగా చూపించడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. నవ్వే మనకు ఒత్తిడులపై విజయం సాధించే ఉత్తమ మార్గం. మనం నవ్వును బతికించగలిగితే… నవ్వే మనల్ని కాపాడుతుంది.

ప్రపంచ నవ్వుల దినోత్సవం మనకు గుర్తుచేసేది ఒక్కటే — జీవితం ఎంత బిజీగా ఉన్నా, ఎంత కఠినంగా మారినా, నవ్వడం మానొద్దు. ఎందుకంటే కొన్ని సమస్యలకు సమాధానం మందుల్లో కాదు… మనసారా నవ్విన ఒక్క క్షణంలోనే దొరుకుతుంది.

-మాధవ్

click here to read more

click here to read more sunday magazines

26aprSunday2026
26aprSunday2026

విధ్వంసం – వికాసం

ఆ గ్రామంలో రామయ్య, సోమయ్య ఇరుగు పొరుగువారు. రామయ్యది చురుకైన బుర్ర.  ఓరిమి, దీర్ఘదృష్టి   కలవాడు. సోమయ్య వితండవాది. పనులు అడ్డదిడ్డంగా చేయడం, అదే అభివృద్ధి అని బుకాయించటం అతని స్వభావం. 

ఒకసారి వారిద్దరి మధ్య  ఒక పెద్ద గొడవ జరిగింది. అది కాస్తా ఊరి పంచాయితీకి చేరింది.  ఊరి పెద్ద గుణనిధి  ఇద్దరు  చెప్పేదీ సావధానంగా  విన్నాడు.

“అయ్యా! మా ఇంటి ముందున్న బావి పాడుబడింది. దాని పక్కనే ఉన్న రామయ్య పాతకాలం నాటి   గోడ రాళ్ళతో బావిని పూడ్చేశాను. పాతగోడ పెచ్చులాడి ఏ క్షణంలో ఎవరి మీద పడుతుందో అని ఊరి జనం బిక్కుబిక్కు  మంటున్నారు. నిజానికి నేను గ్రామానికి  మేలే చేశాను కదా! ” అన్నాడు సోమయ్య అతితెలివికి పోతూ.

రామయ్య నిమ్మళంగా అన్నాడు, “అయ్యా, నన్ను అడగకుండా నా గోడను కూలగొట్టి ఊరిని ఉద్ధరించానంటున్నాడు ఈ సోమయ్య.  జనాలకు అంత ఇబ్బందిగా ఉందనిపిస్తే నేనే నా గోడను కూలగొట్టే వాడిని. ఆ  గోడరాళ్ళను నా స్వంతానికి వాడుకొనేవాడిని. ఈ సోమయ్య తన  బావిని నా రాళ్ళతో పూడ్చుకుని  ఊరికి ఉపకారం చేసానని ఊదరగొడుతున్నాడు! నిజానికి ఈయన చేసింది  విధ్వంసం. దారికడ్డంగా పడ్డ  చెత్తా చెదారాన్ని  కనీసం వూడ్పించనైనా  లేదు! ఊరికి ఈయన చేసిన మేలు ఇంకేముంది?! “

గుణనిధి కాసేపు ఆలోచించి, ఇద్దరికీ ఒక చిన్న పరీక్ష పెట్టారు. “రేపు ఉదయానికల్లా మీ ఇద్దరి ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశాల్లో ఏదైనా ఒక ‘మార్పు’ చేసి చూపించండి. ఎవరి వాదనలో వాస్తవముందో అప్పుడు చెబుతాను” అని అన్నాడు.

 తెల్లవారేసరికి సోమయ్య తన ఇంటి ముందున్న పెద్ద వేప చెట్టును కొట్టేశాడు. “చూశారా! ఇప్పుడు ఎంత ఖాళీ స్థలం  వచ్చిందో…ఇక్కడ ఎంత పెద్ద మేడనైనా కట్టొచ్చు” అన్నాడు గర్వంగా.

 రామయ్య తన ఇంటి ముందున్న ఎండిపోయిన పాత గుంటను శుభ్రం చేసి, చుట్టూ మిగిలిపోయిన తన గోడ మట్టి పోసి, కొన్ని కాయగూరల  విత్తులు జల్లి  తోటకు సిద్ధం చేశాడు. 

ఉపయోగానికే కాదు చూపులకూ అందంగా తయారైన ఆ మునుపటి ఖాళీ జాగాను చూసి “ఇదీ అసలైన వికాసం అంటే! ఏ వస్తువునైనా వ్యవస్థనైనా స్వార్థ ప్రయోజానికి నాశనం చేస్తే అది ‘విధ్వంసం’  అవుతుంది. తన బావిని పూడ్చుకొనే స్వార్థంతో  పొరుగువాడి గోడను కూల్చిన సోమయ్య చేసింది ఈ తరహా విధ్వంసమే! ఉన్నదానికి మెరుగులు దిద్ది, దాన్ని మరింత ప్రజోపకరంగా మార్చడం ‘వికాసం’ అవుతుంది. చెత్తాచెదారంతో  నిండిన ఖాళీస్థలాన్ని కాయగూరల  తోటలా మార్చిన  రామయ్యదే అసలైన  ‘వికాసం’  ” అని  ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాడు గుణనిధి.

==========================

మాట తీరు

ఏ వ్యక్తిని అయినా మనం అంచనా వేసేది అతని మాట తీరు బట్టే కదా. తియ్యగా మాట్లాడే వాళ్ళు మంచివాళ్ళు అని , కటినంగా మాట్లాడే వాళ్ళు చెడ్డవాళ్ళు అని మనం భావిస్తూ ఉంటాం.అయితే ఇది కరెక్టేనా అన్న సందేహం నాకు కలుగుతూ ఉండేది అప్పుడప్పుడు.
ఒకసారి ఆఫీసులో లంచ్ టైంలో క్యాంటీన్ కి వెళ్ళాను. టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి లంచ్ చేస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద సాంబారు , రసం , మంచి నీళ్లు ఇలా అన్నీ ఉన్నాయి. ఇంతలో నాతో పాటే తింటున్న ఒక కొలీగ్ ‘ ఏయ్..సాంబారు ఇలా పాస్ చేయి..’ అని రఫ్ గా అన్నాడు. కోపం వచ్చింది నాకు.అతను నాకు చాలా జూనియర్. మర్యాద లేదా అతనికి అని కోపం వచ్చింది.కానీ కంట్రోల్ చేసుకుని సాంబార్ గిన్నె అతని ముందుకు నెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఒక మెడికల్ పని మీద మా ఆఫీసు హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు. డాక్టర్ నా ట్రీట్ మెంట్ విషయంలో రూల్స్ చెప్పి ఏవేవో ఇబ్బందులు పెడుతుంటే అక్కడే ఉన్న మా కొలీగ్ నాతో ఎంతో మంచిగా మాట్లాడి చక్కటి సలహా ఇచ్చి ఆ ఇష్యూ నుండి బయటపడేలా చేసాడు.
అలాగే ఇంకోసారి…నాకు బాగా సీనియర్ అయిన ఒక కొలీగ్ ను కలవడానికి అతని ఆఫీస్ కి వెళ్ళి పియ్యే తో చెబితే అతను సార్ కి కనెక్ట్ చేసాడు.ఫోన్ ఎత్తిన ఆ సార్ నాతో చాలా రఫ్ గా మాట్లాడాడు .
చాలా బాధ పడి అతన్ని కలవడానికి లోనికి వెళ్ళాను. కాసేపటి తర్వాత ‘ ఇందాక ఏదో టెన్షన్లో ఉన్నాను ..సారీ ‘ అని చెప్పాడు ఆ పెద్ద సార్.
ఇలా.కొంతమంది కఠినంగా మాట్లాడతారు.కానీ మనసు మాత్రం వెన్నెలా ఉంటుంది. అందుకే ఇలాంటి వ్యక్తులు ఎదురైనప్పుడు బాధ పడకుండా కొంచెం సంయమనం పాటించాలి ఫ్రెండ్స్ !

19aprSunday2026
19aprSunday2026

విన్నది, కన్నది ఏది నిజం?!

సర్వేంద్రియానం నయనం ప్రధానం! అంటే మానవ శరీరంలోని అన్ని జ్ఞానేంద్రియాలలో (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) కళ్లు అత్యంత ముఖ్యమైనవని అర్థం. కళ్లే మనకు ప్రపంచాన్ని చూపిస్తాయి, సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, ప్రమాదాలను గుర్తించడానికి, జ్ఞానాన్ని పొందడానికి ప్రధాన సాధనం.
చూసిందే నిజం, విన్నది నిజమో కాదో తెలీదు.

చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు! మూడు కోతులు బొమ్మలు, గాంధీ గొప్ప మాట మనకు తెలుసు!

కళ్ళతో చూసింది మన మెదడు వెంటనే నమ్మేస్తుంది. కళ్ళు ఆశ్చర్యం కనిపిస్తే మైమరచి పోతుంది! కళ్ళు వేగంగా వంద విషయాలు ఒకేసారి చూడగలవు. చూసిన వాటిలో ఎంత విశ్లేషణ చేస్తుంది అనేది వేరే విషయం. మనుషులను బట్టి మారుతుంది! చెవి విషయం వేరు, There is difference between hearing and listening! చెవికి ఎన్నో శబ్దాలు చేరతాయి! కానీ వాటిని అన్నిటినీ మనం వినం. సినిమా అనేది ఒక అద్భుతం, సినిమా వేగాన్ని నాటకం అందుకోవడం అంత కాదు, అందుకే ఈరోజు నేలమీద 90 చోట్ల నాటకం వెనుకబడి సినిమా వేల కోట్ల వ్యాపారంతో ముందుకు దూసుకు వెళ్తోంది. కానీ నాటకం అనే సామాజిక, సామూహిక ప్రత్యక్ష అనుభవం అక్కడ కిటుకులు తెలిసిన వారు గొప్ప సినిమా తీయడం చాలా తేలిక! ఇది ఈరోజు ఎన్నో చోట్ల రుజువు అయ్యింది.

ఈ వారం ఒక మలయాళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన Vaazha-2 (వాలా – 2) biopic of billion brothers అని గర్వంగా చెప్పుకున్నాడు! అది నిజం. ఈ సినిమా గురించి నాకు తెలీదు, వేసవి శెలవులు మొదలు అయ్యాయి, ఇద్దరు మలయాళం టీచర్లకు మెసేజ్ చేశా, ఎలా ఉంది ఈ సినిమా అని, లీనో అనే మ్యాథ్స్ టీచర్ బ్లాక్ బస్టర్ అన్నాడు, గ్రిఫిత్ అనే EFLU యూనివర్సిటీ ఫ్రెండ్ కూడా అదే అన్నాడు. అల్లు సినిమా కోకాపేట వెళ్ళా. సినిమా చూశాక నేను ఒక స్నేహితుడికి నేను ఒక విశ్లేషకుడిగా పంపిన మెసేజ్ ఇది,
ఆగ్లం, తెలుగు కలిపి….

An excellent film, what a remarkable screenplay.

How they managed to make it possible to shoot in such a natural way is nothing short of a miracle. It feels entirely authentic, just like real life.

As a writer and director, I was genuinely thrilled. There are a few minor mistakes and a few areas that could benefit from slight refinement, but that is of no real consequence.

Translating such an important social reality onto the screen is truly magnificent. Using cinematic craft for a meaningful purpose and for social harmony, my goodness, we must sincerely appreciate this film team.

Vaazha-2, వాలా-2 a great film indeed.

ఈ మలయాళం డబ్బింగ్ సినిమా ఓ అద్భుతం, చాలా బాగుంది!

అంత గొప్ప Concept ని అంత మంది యాక్టర్స్ తో shoot చేయడం కూడా ఒక గొప్ప యజ్ఞం!

అంతా మనం ఒక సాక్షీభూతంగా అక్కడే ఉండి చూస్తున్నట్టు ఉంది! అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి, ఎవరో కెమెరా మర్చిపోయారు. Time Capsule లో preserve చేసినట్టు, 50 ఏళ్ల క్రితం సమాజం వాసన ఇంకా అలాగే ఉంది ఏం మారనట్టు…..ఇలా ఆశ్చర్యం కలిగింది నాకు ఎన్నో సార్లు!

అద్భుతం,

నటులు నటన, దర్శకుడు ప్రతిభ, Screenplay magic….., (గొప్ప పాటలు తెలుగులో లేవు, మలయాళంలో తెలీదు, అయినా ఏం లోటు లేదు)…, హీరోయిజం buildups లేవు! పనికిమాలిన elevations లేవు!

Catharsis, క్షాళన నిజంగా ప్రేక్షకులకు కలిగింది! ఎన్నో సార్లు కన్నీళ్లు, తప్పట్లు, సంతోషం, నవ్వుతాం! ఇది సినిమా అద్భుతం అంటే…., (మత సామరస్యం, ఈ మధ్య కొన్ని సినిమాలు వేరే కోణం చూపించాయి, అవి నిజం కావొచ్చు, కానీ ఈ సినిమా ప్రజల మధ్య సత్సంబంధాలు, విద్యార్ధి లోకం, అక్కడ నిజమైన సమస్యలు, ఆశలు, ఆటలు(ఆటలు లేని లోకం, గౌండ్ లేని స్కూల్స్), మానసిక గందరగోళం, అశాంతి, అన్యోన్యత, పాత్రల ఎదుగుదల, వాస్తవం, మార్పు, సంస్కారం… ఇంకా ఎన్నో, చూపించింది…

ఒక రచయిత ఒక ఊహ చేస్తే దానిని తెరపైకి తీసుకురావడం దర్శకుడి పని. సినిమాకు స్క్రిప్ట్ ప్రాణం. రచయిత శిష్యుడు దర్శకుడు అయితే సినిమా పని గొప్పగా సాగుతుంది. శిష్యుడు గురువుని నమ్ముతాడు. శిష్యుడికి చెప్పడానికి గురువుకి సాధికారత ఉంటుంది. Vaazha-2 కి రచయిత విపిన్ దాస్, డైరెక్టర్ Savin SA, Music: అంకిత్ మీనన్, Cinematography: Akhil Leelasuran, Editing : Kannan Mohan, నటులు, Hashir, Al Ameen మొదలైన వారు. ఇందులో నటించిన సినిమా హాలులో పట్టుబడిన అమ్మాయి ఎంతో గొప్పగా నటించింది.

90% అందరూ బాగా నటించారు! కుదిరితే ఈ సినిమా చూడండి. ఇందులో దర్శకుడు చూపించిన సమస్య పై చర్చ చేయండి. ఈ కథ సమాజానికి అవసరం. సినిమా కళ్ళతో చేసేది, ఎంతో ప్రభావితం చేస్తుంది. నేటి కమర్షియల్ సినిమా ఒక జోక్ అయిపోయింది. కేవలం టైం పాస్. ఒక మనిషి వందమందిని కొట్టడం అంతా ఒక కొరియోగ్రఫీ స్టంట్.

జనం సినిమాని సిరియస్ గా తీసుకోవడం మానేశారు. Just time pass అంతే. వ్యాపారం కోసం వ్యాపారం. ఈ సినిమాకి కేవలం పది కోట్లు ఖర్చు అయ్యింది అంట, 230 కోట్లు పైగా వసూళ్లు చేసింది. ఇంకా ఆడుతోంది. 10 నుంచి 13 కోట్లలో ఇంత Quality సినిమా తీయడం ఒక అద్భుతం. ఇది గొప్ప టీమ్ వల్ల మాత్రమే సాధ్యం. ఇంకా ఆ కళ పట్ల, Craft పట్ల ఆరాధన, భక్తి, ఇష్టం, ప్రేమ, గొప్ప ఆకర్షణ, నమ్మకం ఉంటేనే ఇది సాధ్యం.
కళ్ళతో చేసింది, చూసింది, చెవులతో విన్నది రెండు సమన్వయం అయితే, Conviction తో మనసు, సమాజం నమ్ముతుంది! కళ కళ కోసం కాదు, కళ సమాజం కోసం, ఈ కోణంలో మరిన్ని గొప్ప సినిమాలు మన తెలుగులో కూడా రావాలి! ఆంగికం భువనం యశ్వ, వాచకం సర్వ వాఙ్మయం!

=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

మలయప్ప స్వరూప దర్శనం జేష్టాభిషేక వైభవం

తిరుమలక్షేత్రంలో అన్నిరకాల ఉత్సవ సేవలందుకునే ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ని ఎటువంటి కవచాలు లేకుండా ఏడాదికి ఒకసారి దర్శించుకునే భాగ్యం జేష్టాభిషేక ఉత్సవం లోనే లభిస్తుంది. ఏడాది పొడవునా అభిషేక తిరుమంజనాది సేవలలో కనువిందుసేవ చేసే మలయప్పస్వామి కి కవచాలను తొలగించి నిర్వహించే అభిషేక ఉత్సవాన్ని మూడురోజుల జేష్టాభిషేకం గా నిర్వహిస్తారు. ప్రతిరోజూ అభిషేకానంతరం ప్రత్యేక కవచాలతో దర్శనం ఇచ్చే స్వామి చివరి రోజున ధరించే స్వర్ణ కవచంతోనే ఏడాది పూర్తిగా దర్శనమిస్తారు, అందుకే ఈ ఉత్సవాన్ని అభిధ్యేయక ఉత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా జేష్ఠ మాసంలో నిర్వహించే ఉత్సవం కనుక జేష్టాభిషేకం గా ప్రసిద్ధి చెందింది. ఈ విశిష్ట వార్షిక ఉత్సవం 1463 నుంచి ప్రతి ఏటా కొనసాగుతున్నట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి.


ఏడాది పొడవునా కవచంలోనే ఉండే విగ్రహాన్ని శుద్ధి చేయడం, స్వామికి గ్రీష్మ తాపం నుంచి ఉపశమనం కలిగించడం అనే మౌలిక లక్ష్యాలతో ఈ సేవను ప్రతి ఏటా జూన్ నెలలో నిర్వహిస్తారు. మూడు రోజులు నిర్వహించే ఈ ఉత్సవంలో భాగంగా అర్చకులు ప్రతిరోజూ స్వామి వారిని ఉభయదేవేరులతో సంపంగి ప్రాకారం లోని కళ్యాణమండప వేదికపై అధిరోహింప చేస్తారు. అక్కడ ప్రతిరోజూ రెండవ గంట పూర్తి అయిన తరువాత వైఖానస ఆగమోక్త వేద మంత్రచ్చాటనలు, మంగళ వాయిద్యాల నడుమ బంగారు కవచాన్ని తొలగించిన మలయప్ప స్వామికి వివిధ సుగంధ ద్రవ్య జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్టారు
మొదటి రోజున ఆగమోక్తంగా తిరుమంజనం నిర్వహించిన తరువాత వజ్రాలను పొదిగిన వజ్రకవచ ధారిగా స్వామి తిరువీధీ ఊరేగింపులో భక్తులకు దర్శనం ఇస్తారు . రెండవ రోజున తిరుమంజనం నిర్వహించిన తరువాత మేలి ముత్యాలను పొదిగిన ముత్యాల కవచ ధారిగా స్వామి తిరువీధుల్లో ఊరేగుతూ కనువిందు చేస్తారు. చివరి రోజున నిర్వచించే తిరుమంజనం తరువాత ధరింప చేసే మేలిమి బంగారు కవచంతో తిరువీధి ఉత్సవంలో భక్తులను కటాక్షిస్తారు. ఆ పై ఆ బంగారు కవచంతోనే ఏడాది పొడవునా మళ్ళీ మరుసటి ఏడాది జేష్టాభిషేకం నిర్వహించే వరకు మలయప్ప స్వామి అన్ని రకాల సేవల్లో పాల్గొంటారు. ఏడాది అంతా అన్ని సేవల్లో బంగారు కవచధారిగా కనిపించే మలయప్పస్వామి స్వచ్ఛ రూపాన్ని దర్శించుకునే భాగ్యం ఈ ఒక్క ఉత్సవంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఆర్జిత సేవగా నిర్వహించే ఈ సేవలో పాల్గొనడానికి భక్తులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే టిక్కెట్లను పొందే అవకాశం ఉంటుంది.

ఓం నమో వేంకటేశాయ


Leave a Reply