​కాళహస్తిలో విచ్చలవిడిగా మట్టి మాఫియా!

కమ్మ కొత్తూరు చెరువును పిండేస్తున్న జేసీబీలు..
నిద్రమత్తులో అధికారులు


శ్రీకాళహస్తి, ఆగస్టు8 ( ఆంధ్రప్రభ): ​చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో మట్టి మాఫియా ఆగడాలు శృతిమించాయి. శ్రీకాళహస్తి పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న కమ్మ కొత్తూరు చెరువులో అనుమతులు లేవు, నిబంధనలు అసలే లేవు అన్నట్లుగా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి.

రోజుకు రెండు జేసీబీలు, దాదాపు 60 ట్రాక్టర్లతో టన్నుల కొద్దీ మట్టిని దర్జాగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం కనీసం కన్నుతెరిచి చూడకపోవడం గమనార్హం. ​ఇటీవలే ఈ మట్టి మాఫియా వేధింపులు, అరాచకాలకు ఓ ఉపాధ్యాయుడు బలైన దారుణ సంఘటన మరువక ముందే, అదే రీతిలో తవ్వకాలు జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఉపాధ్యాయుడి ప్రాణం పోయినా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల్లో ఎలాంటి చలనం రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


​నిబంధనలన్నీ తవ్వకాల్లో తొక్కేసి..
​చెరువుల్లో పూడిక తీత లేదా మట్టి తరలింపు ప్రక్రియకు ప్రభుత్వ స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి.

​రైతుల అవసరాలకే ప్రాధాన్యం:

చెరువులోని మట్టిని కేవలం స్థానిక రైతుల పొలాల సారవంతం కోసం ఉచితంగా లేదా నామమాత్రపు పర్మిషన్లతో వాడుకోవాలి. వాణిజ్య అవసరాలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు తరలించడం పూర్తిగా చట్టవిరుద్ధం.


​అనుమతుల ప్రక్రియ:

ఇరిగేషన్ (నీటిపారుదల) శాఖ పర్యవేక్షణలో, రెవెన్యూ శాఖ నుండి మైనింగ్ పర్మిషన్లు పొందిన తర్వాతే తవ్వకాలు చేపట్టాలి.


​పరిమిత లోతు:

చెరువు పునాదులు, నీటి నిల్వ సామర్థ్యం దెబ్బతినకుండా కేవలం నిర్దేశిత లోతు (రెండు నుండి మూడు అడుగులు) వరకు మాత్రమే మట్టిని తీయాలి. లోతుగా గుంతలు తోడటం వల్ల వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతాయి.​ భారీ జేసీబీలతో లోతైన తవ్వకాలు జరపకూడదు.



​చెరువుల పరిరక్షణ, అక్రమ తవ్వకాల నిరోధంలో రెవెన్యూ (తహశీల్దార్, ఆర్‌ఐ), నీటిపారుదల శాఖ (ఇరిగేషన్ ఏఈ, డిఈ) అధికారులు ప్రధాన పాత్ర వహించాలి. అలాగే మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకోవడానికి పోలీసులు, గనుల శాఖ (మైనింగ్) అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలి. అయితే అధికారులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి.


​అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వదిలి, కమ్మ కొత్తూరు చెరువును కాపాడటంతో పాటు, మట్టి మాఫియాపై కఠినమైన పిడియాక్ట్ కేసులు నమోదు చేయాలని శ్రీకాళహస్తి ప్రజలు కోరుతున్నారు.