నేరాల నియంత్రణకే కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్: డీఎస్పీ శ్రీనివాసరెడ్డి
హుజూర్‌నగర్‌లో తెల్లవారుజామున పోలీసుల విస్తృత తనిఖీలు.. 51 వాహనాలు సీజ్
హుజూర్‌నగర్, (ఆంధ్రప్రభ): ప్రజల భద్రత, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచి కాలనీలోని ఇళ్లు, వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 42 మోటార్ సైకిళ్లు, 8 ఆటోలు, ఒక టాటా ఏస్ వాహనం ఉన్నాయి.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, నేరాలను అరికట్టడం, ప్రజల్లో భరోసా పెంచడమే ఈ తనిఖీల ఉద్దేశమన్నారు. గుర్తింపు లేని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వవద్దని, వాహనాలకు అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గంజాయి వంటి మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు లేదా డయల్ 100, 112కు తెలియజేయాలని కోరారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
