Manchu Manoj | క్లారిటీ ఇచ్చేసిన మనోజ్!

Manchu Manoj | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మనోజ్, కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక విషయాలపై కూడా ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి రాజకీయాల్లో ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చలు నడుస్తున్నాయి. మనోజ్‌ భార్య బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి రావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత చేకూరింది.

తాజాగా తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్, ఈ ఊహాగానాలపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య రాజకీయ భవిష్యత్తు, తన సొంత పొలిటికల్ ప్లాన్స్ గురించి ఆయన పంచుకున్నారు.

మే20 తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన ఒక కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మౌనిక రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని మనోజ్ స్పష్టం చేశారు. ఆమె ఒక రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చినందున, ఆమెకు ప్రజల్లోకి వెళ్లి సేవ చేయాలనే బలమైన కోరిక ఉందని చెప్పారు. భార్య నిర్ణయానికి తన పూర్తి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

అయితే, తన సొంత రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూ.. తనకు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని, కానీ సమాజ సేవలో ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. ఇందుకోసం తామిద్దరం కలిసి సామాజిక సేవా కార్యక్రమాల కోసం ‘ఐక్య ధైర్య సేన సమితి’ని కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.

Leave a Reply