రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పై దుష్ప్రచారం

రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పై దుష్ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ: బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లుతో పాటు పునర్విభజన బిల్లును కూడా ప్రవేశపెట్టి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు ద్రోహం తలపెట్టిందని టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఉత్తరాది రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన అక్కడ ఎక్కువ ఎంపీ సీట్లను పెంచి తక్కువ జనాభా ఉన్న దక్షిణాది రాష్ట్రాల అధికారాన్ని దెబ్బతీయడం కోసం మహిళా బిల్లు మిషతో పునర్విభజన బిల్లును ఆమోదం చేయించాలని భారీ కుట్రకు మోడీ ప్రభుత్వం పూనుకుంటే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ మహిళలకు వ్యతిరేకమంటూ దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ అసలు మహిళలకు రిజర్వేషన్ కల్పించిందే రాజీవ్ గాంధీ హయాంలో అన్న విషయాన్ని తెలుసుకోవాలని ఆయన చెప్పారు.

ప్రతిభా పాటిల్, మీరా నాయర్ వంటి మహిళలను రాష్ట్రపతి, స్పీకర్ పదవులకు ఎంపిక చేసిన ఘనత కాంగ్రెస్ దేనిని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడు మహిళల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన చరిత్ర కాంగ్రెస్ కు ఉన్నదని ఆయన తెలిపారు. బీజేపీని నమ్మే పరిస్థితిలలో ప్రజలు లేరని అన్నారు. ఎక్కువ స్థానాలను ఉత్తరాదిలో పెంచుకోవడం ద్వారా మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కుట్రలను కాంగ్రెస్ సాగనివ్వదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

Leave a Reply