స్థానికత నిబంధనల్లో మార్పులు.. కొత్త జోనల్ విధానం అమలు

స్థానికత నిబంధనల్లో మార్పులు.. కొత్త జోనల్ విధానం అమలు
ఆంద్రప్రభ వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2005ను రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేయడంతో, ఇంతవరకు అమల్లో ఉన్న 1975 ఆర్డర్ రద్దయింది. దీంతో రాష్ట్రంలో కొత్త స్థానికత విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రాన్ని 26 జిల్లాల ఆధారంగా 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. తాజాగా ఏర్పడిన కొత్త జిల్లాల కారణంగా భవిష్యత్తులో ఈ సంఖ్యను 28 జిల్లాలకు విస్తరించే అవకాశం ఉంది.
లోకల్ కేడర్ విధానం ఎలా ఉంటుంది?
కేంద్రం నిర్ణయించిన ప్రకారం, అన్ని పోస్టులను 27 నెలలలోపు కొత్త కేడర్ వ్యవస్థలోకి మార్చాలి. జూనియర్ అసిస్టెంట్ స్థాయి మరియు దానికి కంటే తక్కువ పోస్టులు, ఉపాధ్యాయ ఉద్యోగాలు జిల్లా యూనిట్ పరిధిలోకి వస్తాయి. సూపరింటెండెంట్ స్థాయి వరకు ఉన్న గెజిటెడ్ పోస్టులు జోన్ పరిధిలోకి వస్తాయి. డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు ఉన్న ఉన్నత ఉద్యోగాలు మల్టీ జోన్ కేడర్‌గా పరిగణించబడతాయి. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉన్నవాటిని మల్టీ జోన్ కేటగిరీలోకి మార్చనున్నారు. అయితే సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి సంస్థలు, రాజధాని ప్రాంత పోలీసు ఉద్యోగాలకు ఈ స్థానికత నిబంధనలు వర్తించవు.
స్థానికులకు ఎక్కువ అవకాశాలు
కొత్త నియమాల ప్రకారం, నేరుగా చేసే ఉద్యోగ నియామకాల్లో 95 శాతం స్థానికులకు కేటాయిస్తారు. మిగతా 5 శాతం స్థానికేతరులకు ఉంటుంది. ఒక ప్రాంతంలో స్థానిక అభ్యర్థులు లేని పక్షంలో, ఆ పోస్టులను మూడు సంవత్సరాల వరకు ఖాళీగా ఉంచి తర్వాత భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కనీసం ఒక పోస్టును ఓపెన్ కేటగిరీగా ఉంచడం తప్పనిసరి.
జోన్ల విభజన ఇలా..
మల్టీ జోన్ – 1:
జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
జోన్ 2: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ
జోన్ 3: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
మల్టీ జోన్ – 2:
జోన్ 4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
జోన్ 5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప
జోన్ 6: నంద్యాల, అనంతపురం, కర్నూలు
