మాచర్ల- గురజాల అభివృద్ధి, శాంతి భద్రతలే లక్ష్యంగా ఎమ్మెల్యేల కీలక భేటీ
మాచర్ల, ఆంధ్రప్రభ : మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గురువారం సమావేశమై పల్నాడు ప్రాంతంలోని పలు కీలక అంశాలపై చర్చించారు. పల్నాడులో వైసీపీ చేస్తున్న హత్యా రాజకీయాలు, దాడుల సంస్కృతికి అడ్డుకట్ట వేసి శాంతియుత వాతావరణం తీసుకురావడంపై చర్చించారు. రెంటాల గ్రామానికి చెందిన చెన్నారెడ్డి హత్యను టీడీపీకి ఆపాదించేందుకు జగన్ చేసిన కుట్రలని ఖండించారు. ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని,
అందుకోసం మాచర్ల గురజాల ప్రాంతాలకు భారీ పరిశ్రమలు తీసుకురావాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై సీఎం ద్రబాబునాయుడును కలిసి కోరాలని నిర్ణయించారు. అలాగే బుగ్గవాగు మరమ్మత్తులు, ఆధునీకరణ కోసం అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎంను కలిసి నిధులు కోరాలని నిర్ణయించారు. పల్నాడులో హింసకు స్వస్తి అభివృద్ధి, ఉపాధికి పెద్దపీట వేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఇరువురు నేతలు తెలిపారు.
