చిత్తూరులోకి చిరుత పులులు

చిత్తూరులోకి చిరుత పులులు

రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభం
కలవరపెడుతున్న జింకల మృతి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు పట్టణ పరిసరాల్లో వన్యప్రాణుల సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు చిరుతపులి చిక్కుకుని బయటపడలేక అవస్థలు పడుతుండగా, మరోవైపు జింకల మృతి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

దొడ్డిపల్లి సమీపంలో శనివారం రాత్రి మూడు చిరుతపులులు కనిపించాయని స్థానికులు తెలిపారు. వాటిలో పరస్పరం ఘర్షణ జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘర్షణలో ఒక చిరుత తీవ్రంగా గాయపడగా, బండల మధ్య ఉన్న లోతైన ప్రదేశంలో కాలు ఇరుక్కుపోవడంతో బయటికి రాలేకపోయింది. రాత్రి వేళల్లో వినిపించిన అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఘటనను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన చిరుతకు మత్తుమందు ఇచ్చి సురక్షితంగా బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన రెండు చిరుతలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. దొడ్డిపల్లి సబ్‌స్టేషన్ వెనుక ఉన్న హౌసింగ్ కాలనీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుంటున్నారు. అధికారులు మాత్రం ప్రజలు అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, చిత్తూరు నగరంలో జింకల మృతి ఘటనలు కూడా కలవరపెడుతున్నాయి. నగరంలోని 15వ డివిజన్ రెడ్డిగుంట సమీపంలోని వినాయక స్వామి ఆలయం వద్ద అటవీ ప్రాంతం నుంచి నీటి కోసం వచ్చిన ఓ జింక వీధి కుక్కల దాడికి గురై మృతి చెందింది. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

గత మూడు రోజుల కిందట కూడా జింకల పార్క్ సమీపంలో రెండు జింకలు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అలాగే నెలరోజుల కిందట మరో జింక మృతి చెందినట్లు గుర్తించారు. అంతేకాకుండా, ఇటీవల చెన్నమ్మగుడిపల్లి వద్ద పాడుబడ్డ బావిలో ఒక చిరుతపులి మృతదేహం లభ్యమవడం కూడా సంచలనం కలిగించింది.

మరింతగా, సంతపేట, మురకంబట్టు వంటి పట్టణ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటం గమనార్హం. ఆరు నెలల కిందట మూడు ఏనుగులు కూడా పట్టణంలోకి రావడం, వాటిని అటవీ ప్రాంతాలకు మళ్లించడం జరిగింది.

వేసవి కారణంగా అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోవడంతో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో అవి ప్రమాదాలకు గురవడం, మృతి చెందడం జరుగుతోంది.

అటవీ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేసి, వన్యప్రాణులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు కూడా వన్యప్రాణుల కదలికలపై నిఘా పెంచి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Leave a Reply