వేదాలు వ్యక్తి ఔన్నత్యం పెంచుతాయి

వేదాలు వ్యక్తి ఔన్నత్యం పెంచుతాయి

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
తాడేపల్లి మలయాళ ఆశ్రమంలో వేద పాఠశాల ప్రారంభం

ఘంటసాల: వేదాలు వ్యక్తి ఔన్నత్యం పెంచుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం ఘంటసాల మండలం తాడేపల్లిలోని శ్రీ మలయాళ స్వామి ఆశ్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన శృతి భారతి వేద పాఠశాలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, జాతీయ సంస్కృత యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య గుళ్ళపల్లి శ్రీరామకృష్ణ, ఏర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతి పరిపూర్ణానంద గిరి స్వామి చేతులమీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పూర్వం వేద ఘోషతో అలరారిన దివిప్రాంతంలో మళ్ళీ వేదాల పునరుజ్జీవనానికి బాటలు వేస్తున్న మలయాళ స్వామి ఆశ్రమం వారిని అభినందించారు. మనిషి నడవడికను తీర్చిదిద్దే వేద అధ్యయనం వినయ సంపన్నత అలవరుస్తుందన్నారు. కేరళ నుంచి వచ్చిన మలయాళ స్వామి ప్రధానంగా ఈ ప్రాంతంలో భక్తి, ధ్యానం, సేవ ధ్యేయాలతో కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తనను తాను తెలుసుకోవటమే నిజమైన విద్య – తనను తాను జయించటమే నిజమైన విజయం అని ప్రభోధించిన మలయాళ స్వామి బోధనలు మనిషి వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తాయన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానంతో పలుమార్లు అనర్ధాలు సంభవిస్తున్నప్పటికీ, వేద విజ్ఞానం మాత్రమే ఉన్నత సమాజానికి బాటలు వేస్తోందన్నారు. ప్రపంచ దేశాల్లో దాదాపు కుటుంబ వ్యవస్థ అంతరించిపోయినా, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ పరిఢవిల్లుతుందంటే అందుకు ప్రధాన కారణం వేదాల ద్వారా భారతీయులు అలవర్చుకున్న సంస్కారమే ప్రధాన కారణం అన్నారు. దేశంలో మరోసారి కుటుంబ వ్యవస్థకు ముప్పు ఏర్పడుతున్న నేపథ్యంలో మరోసారి వేదాల సారాన్ని సామాన్య ప్రజలకు చేరవేయటం, నేటితరానికి వేద శిక్షణ ఇవ్వటం ద్వారా సమాజంలో విలువలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ దిశగా నేటితరానికి వేద శిక్షణ ఇచ్చేందుకు వేద పాఠశాల ఏర్పాటు చేసిన మలయాళ స్వామి ఆశ్రమ నిర్వాహకులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అభినందించారు.

కార్యక్రమంలో ప్రముఖ తెలుగు కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగశాస్త్రి, ఎన్ఆర్ఐ మూల్పూరి వెంకటరావు – సావిత్రి దంపతులు, జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మెన్ గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అసంగానంద గిరిస్వామి, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగు సహస్రావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కావూరి కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.