ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో స్టాన్‌ఫోర్డ్ బృందం పరిశీలన
నేల తేమ, అంతర పంటలు, ఆగ్రో ఫారెస్ట్రీపై శాస్త్రీయ అధ్యయనం
ఉమ్మడి గుంటూరు బ్యూరో, (ఆంధ్రప్రభ): ప్రకృతి వ్యవసాయం, రసాయన వ్యవసాయ పద్ధతుల మధ్య వ్యత్యాసాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం గుంటూరు జిల్లాలో పర్యటించింది. కొల్లిపర మండలం తూములూరు గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బృందం నేల తేమ, పంటల వైవిధ్యం, అంతర పంటల సాగు, ఏక పంట విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లోని నేల తేమ పరిస్థితులను ఏక పంట సాగు చేస్తున్న పొలాలతో పోల్చి అధ్యయనం చేయడం ఈ పరిశోధనలో ప్రధాన అంశంగా ఉందని బృందం తెలిపింది. ఇందుకోసం ఎంపిక చేసిన క్షేత్రాల్లో సాయిల్ మాయిశ్చర్ ప్రోబ్స్ ద్వారా నేల తేమకు సంబంధించిన రీడింగులను నమోదు చేశారు. పంటల పరిస్థితి, మొక్కల పెరుగుదల, క్షేత్ర నిర్మాణం, వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసేందుకు 360 డిగ్రీల కెమెరాతోనూ డేటాను సేకరించారు.
నాలుగు క్షేత్రాల్లో పరిశీలన
పరిశోధకుల బృందం తూములూరులోని నాలుగు రైతుల క్షేత్రాలను సందర్శించి వివిధ అంశాలపై వివరాలు సేకరించింది. నామిన రోశయ్య, భూమి భారతి–బాపయ్య, పృథ్వీరాజు, ముళ్లపూడి రంగయ్య–విజయలక్ష్మికి చెందిన క్షేత్రాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఆయా పొలాల్లో సాగు విధానం, పంటల అమరిక, అంతర పంటల పరిస్థితి, నేల తేమ, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలను నమోదు చేశారు.
పంటల వైవిధ్యం, అంతర పంటల సాగు, నేల తేమ నిర్వహణ వంటి అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన స్టాన్‌ఫోర్డ్ బృందం క్షేత్రస్థాయి అనుభవాలపై ఆసక్తి వ్యక్తం చేసింది. రైతుల పొలాల నుంచే శాస్త్రీయ పద్ధతుల్లో డేటాను సేకరించడం ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రభావంపై మరింత స్పష్టమైన ఆధారాలను సేకరించవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఈ పర్యటనలో RySSకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ బిరాదర్, స్టాన్‌ఫోర్డ్ సస్టెయినబిలిటీ యాక్సిలరేటర్ డైరెక్టర్ జెఫ్రీ బ్రౌన్, పరిశోధకులు సిద్ధార్థ్ సచ్‌దేవా, వేద శంకర, GCCC ప్రాజెక్ట్ ట్రైనర్ వేణుగోపాల్, WELL Labs అనలిస్ట్ అనూ శెట్టి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నుంచి PLAలు టీ. దివ్యశ్రీ, పి. శ్రావ్య, YRF-2 బృందం, RySS జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీపీఎం రాజకుమారి స్టాన్‌ఫోర్డ్ బృందంతో కలిసి క్షేత్రాలను పరిశీలించి, గుంటూరు జిల్లాలో రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యం, క్షేత్రస్థాయి అమలు తీరును వివరించారు. ఆధునిక శాస్త్రీయ పరికరాలతో సేకరిస్తున్న డేటా, రైతుల అనుభవాలు, క్షేత్రస్థాయి పరిశీలనల సమన్వయంతో సాగుతున్న ఈ అధ్యయనం ప్రకృతి వ్యవసాయంపై శాస్త్రీయ ఆధారాలను బలోపేతం చేయడంలో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
