TET | ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్..
TET | ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్..
హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇన్సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేకంగా మరో రెండు టెట్ (Teacher Eligibility Test) పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఏడాది నిర్వహించే రెండు టెట్లతో పాటు, ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులకు అదనంగా రెండు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టెట్ అర్హత పొందని ఇన్సర్వీస్ టీచర్లకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంతో పాటు ఉపాధ్యాయులు ఉద్యోగ అర్హతలను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో వేలాది మంది ఇన్సర్వీస్ టీచర్లకు మరో అవకాశం లభించనుంది.
