తంగడంచ చెరువుపై కలెక్టర్ ఫోకస్
నీటి నిల్వ పెంపునకు ప్రత్యేక చర్యలు..
నిర్లక్ష్యానికి తావులేదని అధికారులకు హెచ్చరిక
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమం కింద తంగడంచ చెరువులో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు శాశ్వత ప్రయోజనం కలిగించే విధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో తంగడంచ చెరువు పరిధిలో చేపడుతున్న ఫీడర్ ఛానల్, నీటి ప్రవాహ మార్గాల అభివృద్ధి, చెరువు కట్టల బలోపేతం, నిల్వ సామర్థ్య పెంపు పనులపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తంగడంచ చెరువు అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చెరువులోకి నీటి ప్రవాహాన్ని మెరుగుపరిచే ఫీడర్ ఛానల్ పనులు పూర్తిస్థాయిలో అమలైతే గతంతో పోలిస్తే అధికంగా నీటి నిల్వ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కేవలం పనులు పూర్తి చేయడమే కాకుండా, వాటి ద్వారా చెరువు నిల్వ సామర్థ్యం ఎంత పెరుగుతుందో, భూగర్భ జలాల రీఛార్జ్ ఎంత మేరకు మెరుగుపడుతుందో స్పష్టమైన వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు పరిధి, ఫీడర్ ఛానళ్లు, సప్లై ఛానళ్లు, ఆక్రమణల వివరాలు, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, అదనంగా సృష్టించగల నిల్వ సామర్థ్యం తదితర అంశాలపై సమగ్ర స్కెచ్లు రూపొందించాలని సూచించారు.
రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. తంగడంచ చెరువును కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా గ్రామ ప్రజలు, రైతులకు ఉపయోగపడే ఆదర్శ జలవనరుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
చెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు మెరుగుపడేలా చర్యలు ఉండాలని తెలిపారు. డీఎంఎఫ్ నిధులతో చేపడుతున్న పనుల్లో ప్రతి రూపాయి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
పనుల అమలులో జాప్యం లేకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని ఆదేశించారు. చెరువు పరిసరాల్లో అక్రమ తవ్వకాలు, ఆక్రమణలు, భూవినియోగ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు భూముల పరిరక్షణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
జలధార–జలహారతి కార్యక్రమం ద్వారా చెరువుల అభివృద్ధి, నీటి నిల్వ పెంపు, భూగర్భ జలాల రీఛార్జ్, గ్రామీణ జీవనోపాధి బలోపేతం లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జలవనరుల ఎస్ఈ శివశంకర్, డ్వామా పీడీ సూర్యనారాయణ, భూగర్భ జల శాఖ డీడీ రఘురామ్, ఇరిగేషన్ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
