ఎదురెదురుగా కారు, ఆటో ఢీ..
ఒకరికి తీవ్ర గాయాలు
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
మండల కేంద్రంలోని పెట్రోల్ పంపు ఎదురుగా ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మెదక్ వైపు నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కారు, గోపాల్‌పేట నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ఆఫ్రిది తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపైనే కారును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై ఉన్న కారు, ఆటోను తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
