స్వ‌యం ఉపాధి.. సాధికార‌త‌కు పునాది..

స్వ‌యం ఉపాధి.. సాధికార‌త‌కు పునాది..

సాంకేతిక‌త చేయూత‌తో ఆర్థికంగా ఎద‌గాలి
మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డంలో అలీప్ కీల‌క భాగ‌స్వామ్యం
జిల్లాలో రైజ్ కేంద్రం ద్వారా ఔత్సాహికుల‌కు ప్రోత్సాహం
ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధి.. వ్యక్తిగత స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛకు, సమాజ అభివృద్ధికి కీలక మార్గ‌మ‌ని.. సొంతంగా ఉపాధి అవకాశాలను సృష్టించుకోవడం ద్వారా మ‌హిళ‌లు తమ ప్రతిభను వెలికితీసి, ఉన్న‌తంగా ఎదిగేందుకు అవ‌కాశ‌ముంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఎంఎస్ఎంఈలు, స్టార్ట‌ప్‌ల అభివృద్ధి లక్ష్యంగా అసోసియేష‌న్ ఆఫ్ లేడీ ఆంత్ర‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (అలీప్‌) వి కార్ట్ ఎగ్జిబిష‌న్‌, భాగ‌స్వాముల స‌ద‌స్సు శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోట‌ల్ మేనేజ్‌మెంట్ అండ్ కేట‌రింగ్‌లో ప్రారంభ‌మైంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ మెర్సీ ఎపావో, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, జెడ్‌పీ మాజీ ఛైర్మ‌న్ గ‌ద్దె అనూరాధ హాజ‌ర‌య్యారు. డీఆర్‌డీఏతోపాటు వివిధ మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లు ఏర్పాటు చేసిన స్టాళ్ల‌ను సంద‌ర్శించారు. ఆయా యూనిట్ల వ్య‌వ‌స్థాప‌కుల‌తో మాట్లాడి వ్యాపార వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మహిళలు పారిశ్రామిక రంగంలో ముందుకు రావడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెటింగ్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా సమాజ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు.

మ‌హిళ‌ల‌ను ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న దిశ‌గా ప్రోత్స‌హించ‌డంతో పాటు వారిని విజ‌యం దిశ‌గా చేయిప‌ట్టి న‌డిపించ‌డంలో అలీప్ కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు. జిల్లాలోని గుంటుప‌ల్లిలో రైజ్ కేంద్రం ద్వారా కూడా ఔత్సాహిక మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని తెలిపారు. అలీప్ అధ్య‌క్షురాలు ర‌మాదేవి క‌న్నెగంటి మాట్లాడుతూ అలీప్‌- పే నియ‌ర్ బై మ‌ధ్య ఎంవోయూ కుదిరింద‌న్నారు. ఈ నెల 25వ తేదీ వ‌ర‌కు ఎగ్జిబిష‌న్ కొన‌సాగుతుంద‌ని.. వివిధ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టెక్నాలజీ, వ్యాపార అవకాశాలు, మహిళా సాధికారత, హ్యాకథాన్, ఆర్థిక అవగాహన వంటి అంశాలపైనా చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు. ఎంఎస్ఎంఈల బ‌లోపేతానికి, మ‌హిళల ఆర్థిక పురోగ‌తికి ఈ కార్య‌క్ర‌మం దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, అలీప్ ప్ర‌తినిధులు తదిత‌రులు పాల్గొన్నారు.