India New Nuclear Strategy | అణ్వస్త్రాల మోహరింపు.. భారత్ కొత్త అణు వ్యూహం

India New Nuclear Strategy |12 అణ్వస్త్రాల మోహరింపు.. భారత్ కొత్త అణు వ్యూహం

India New Nuclear Strategy | స్టాక్ హోమ్: భారత్ తన అణ్వాయుధ విధానంలో ఒక కీలక మార్పును సూచిస్తూ తొలిసారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. ఈ విషయాన్ని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి) వెల్లడించింది. దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న విధానానికి ఇది పూర్తి భిన్నమైన విధానమని పేర్కొంది. భారత్ అణ్వాయుధాలను నిల్వగా కాకుండా, కార్యాచరణ కోసం మోహరించినట్లు వర్గీకరించడం ఇదే మొదటిసారని నివేదిక పేర్కొంది. ప్రయోగానికి సిద్ధంగా ఉన్న అణ్వాయుధాలను భూగర్భ క్షిపణి స్థావరాలో, కొత్త అణు జలాంతర్గాములో మోహరించడం దేశం యొక్క సంసిద్ధతలో పెరుగుదలను సూచిస్తుంది. కొత్తగా మోహరించిన ఈ 12 అణ్వాయుధాలను దేశ అణ్వాయుధ ప్రయోగ వ్యవస్థలతో జత చేయడం లేదా వాటిని సైనిక దళాలు ఉన్న స్థావరాలలో ఉంచడం ఇదే మొదటిసారని నివేదిక వివరించింది.

బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి (ఎస్ఎస్బిఎన్)పై వార్‌హెడ్లను మోహరించడం, నిరోధక గస్తీ నిర్వహించడం కోసం భారత్ గత ఏడాది అణ్వాయుధాలను స్వల్పంగా పెంచినట్లు తెలిపింది. 2026 జనవరి నాటికి భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. పాకిస్తాన్ వద్ద 170 అణ్వస్త్రాలు ఉన్నట్లు పేర్కొంది. 2024తో పోలిస్తే స్వల్పంగా పెరిగాయని, ఆ ఆయుధాలను విమానాలు, భూ ఆధారిత క్షిపణులు, ఎస్ఎస్బీఎన్లతో కూడిన అభివృద్ధి చెందుతున్న అణు త్రయానికి కేటాయించినట్లు వెల్లడించింది.

మారిన భారత్ వైఖరి

• ఏ క్షణమైనా కార్యాచరణకు సంసిద్ధత
• ఈ తరహా విధానం ఇదే మొదటిసారి
• ఇండియా వద్ద 190 అణ్వాయుధాలు
• సైనిక వ్యయంలో ఐదో స్థానం

ఇప్పటి వరకు భారత్ తన అణ్వాయుధాలను మోహరించిన లాంచర్లతో కాకుండా వేరుగా నిల్వ చేస్తుందని భావిస్తున్నారు. అయితే క్షిపణులను క్యానిస్టర్లలో ఉంచడం, సముద్ర ఆధారిత నిరోధక గస్తీ నిర్వహించడం వంటి చర్యలు భారతదేశ వైఖరిలో వస్తున్న మార్పును తెలియజేస్తున్నాయని పేర్కొంది. సాధారణ శాంతి కాలంలో కూడా భారత్ కొన్ని వార్‌హెడ్లను వాటి లాంచర్లతో మోహరిస్తోంది. అణ్వాయుధాల విషయంలో భారత్ తన మొదట ఉపయోగించరాదు అనే విధానాన్ని అనుసరిస్తోంది. అణుదాడిని మొదట ప్రారంభించబోమనే తన విధానానికి కట్టుబడి ఉంది. భారత భూభాగంపై గానీ, ఎక్కడైనా భారత బలగాలపై గానీ అణుదాడి జరిగే, దానికి ప్రతీకారంగా మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తారు. పరిమితంగానే అయినప్పటికీ, భారత్ సమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉందని, ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికి రూపొందించబడిందని సిప్రి నివేదిక వివరించింది.

ప్రపంచ దేశాలు తమ శక్తి సాధనాలుగా అణ్వాయుధాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని వివరించింది. 2025లో భారత్ మరోసారి తన అణ్వాయుధాలను కొద్దిగా విస్తరించుకుందని, కొత్త రకాల అణు ప్రయోగ వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోందని తెలిపింది. అంతేకాకుండా చైనా వ్యాప్తంగా లక్ష్యాలను ఛేదించగల సుదూర లక్ష్యాలను టార్గెట్ చేయగల ఆయుధాలను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా దృష్టిసారిస్తోందని, అయినప్పటికీ, పాకిస్తాన్‌తో ఉన్న చిరకాల వైరంపై కూడా ప్రణాళికలు కొనసాగుతున్నాయని కూడా పేర్కొంది.

పాకిస్తాన్ కూడా 2025లో కొత్త ప్రయోగ వ్యవస్థలను అభివృద్ధి చేయడం, విధ్వంసకర ఆయుధాలను పోగు చేయడాన్ని కొనసాగించిందని తెలిపింది. రాబోయే దశాబ్దంలో పాకిస్తాన్ అణ్వాయుధాలను విస్తరించవచ్చని హెచ్చరించింది. 2025 మేలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన స్వల్పకాలిక సాయుధ ఘర్షణ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉన్న పాకిస్తాన్ వైమానిక, క్షిపణి స్థావరాలపై భారత్ దాడి చేసినట్లు పేర్కొంది. అయితే, ఉద్రిక్తతలు పెరగకుండా ఇరు పక్షాలు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

2026 నాటికి అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ అనే 9 దేశాల వద్ద సుమారు 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు తెలిపింది. ఇందులో 9,745 సైన్యాల వద్ద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

సిప్రి నివేదిక ప్రకారం, ప్రపంచంలోనే అత్యధికంగా సైనిక వ్యయం చేస్తున్న దేశంగా అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 2024తో పోలిస్తే 2025లో ఆ దేశం 7.5 శాతం వ్యయాన్ని తగ్గించిందని, అయినప్పటికీ మొత్తం వ్యయం 954 బిలియన్ డాలర్లు ఉందని, ఇది ప్రపంచ మొత్తం సైనిక వ్యయంలో 33 శాతం ఉంటుందని వివరించింది. 336 బిలియన్ డాలర్లతో చైనా రెండవ అతిపెద్ద సైనిక వ్యయం కలిగి ఉండగా, మూడవ స్థానంలో ఉన్న రష్యా 190 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. జర్మనీ నాలుగవ స్థానంలో ఉండగా, 92.1 బిలియన్ డాలర్ల వ్యయంతో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.

2024తో పోలిస్తే భారత్ సైనిక వ్యయం 2025లో 8.9 శాతం పెరిగినట్లు సిప్రి తెలిపింది. అత్యధికంగా సైనిక వ్యయాలు చేసే 15 దేశాలు కలిసి 2025లో ప్రపంచ సైనిక వ్యయంలో 80 శాతం వాటాను కలిగి ఉన్నట్లు వివరించింది. 2025లో ప్రపంచ సైనిక వ్యయం వరుసగా 11వ ఏడాది కూడా పెరిగి 2.9 ట్రిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొంది. 2021-25 మధ్య కాలంలో 162 దేశాలు ప్రధాన ఆయుధాలను సమీకరించినట్లు తెలిపింది. ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ అనే ఐదు దేశాలు అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేసిన దేశాలుగా నిలిచాయి. ఈ కాలంలో జరిగిన మొత్తం ఆయుధ దిగుమతుల్లో వీటి వాటా 35 శాతంగా ఉంది.

పెరుగుతున్న సైబర్ యుద్ధాలు

అంతేకాకుండా, ఆధునిక సంఘర్షణలలో సైబర్ కార్యకలాపాలు ఒక అంతర్భాగంగా పరిణామం చెందడం కొనసాగుతోందని తెలిపింది. దీనికి రష్యా, ఉక్రెయిన్ దేశాలను ముఖ్యమైన ఉదాహరణలుగా నివేదిక పేర్కొంది. 2025 మేలో అసాధారణంగా తీవ్రమైన సైనిక సంక్షోభం తలెత్తినప్పుడు భారత్, పాకిస్తాన్ తొలిసారిగా సాయుధ పోరాటంలోకి సైబర్ కార్యకలాపాలను బహిరంగంగా అనుసంధానించాయని తెలిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ తమ ఘర్షణ సమయంలో సమన్వయంతో డిజిటల్ యుద్ధాన్ని కొనసాగించాయని తెలిపింది.

Leave a Reply