High Court Angry on HYDRA Commissioner| హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
High Court Angry on HYDRA Commissioner| హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
High Court Angry on HYDRA Commissioner| కోర్టు ఉత్తర్వుల అమలులో జాప్యంపై అసంతృప్తి
అఫిడవిట్‌పై కూడా హైకోర్టు అసంతృప్తి
భవిష్యత్తులో నిర్లక్ష్యం ఉపేక్షించబోమని హెచ్చరిక
High Court Angry on HYDRA Commissioner| హైదరాబాద్, ఆంధ్రప్రభ: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వేనెం.105లోని రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ నోటీసు, కంచెను 48 గంటల్లో తొలగించాలన్న ఆదేశాలను గడువులోగా అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ను మూసివేసినప్పటికీ, కమిషనర్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భవిష్యత్ లో ఇలాంటి నిర్లక్షాన్య్ని ఉపేక్షించబోమని హెచ్చరించింది. సూరారంలోని వివాదాస్పద భూమిలో ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా హైడ్రా అధికారులు కంచె వేసి బోర్డు ఏర్పాటు చేశారంటూ జితేంద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ గతంలో కంచె, బోర్డును 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు.
అయితే ఆ ఉత్తర్వులు అమలు కాకపోవడంతో జితేంద్ర కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై మంగళవారం మరోసారి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాలేని పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా హాజరయ్యే అవకాశం ఉందని, కనీసం హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అఫిడవిట్ కూడా దాఖలు చేయ కపోవడం ఆయన నిర్లక్ష్య వైఖరిని సూచిస్తోందని వ్యాఖ్యానించింది. భూములకు సంబంధించిన ప్రతి వివాదంలో ఎందుకు తొందరపడి బోర్డులు, కంచెలు ఏర్పాటు చేస్తున్నారని హైడ్రాను ప్రశ్నించింది. భూములు అక్కడే ఉంటాయని, పిటిషనర్లు కూడా ఎక్కడికీ వెళ్లిపోరని, కోర్టులో వివాదం తేలే వరకు ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారని ప్రశ్నించింది. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా బోర్డులు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించింది. కోర్టు పరిధిలో ఉన్న అంశాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని కూడా హెచ్చరించింది.
కోర్టు ఆదేశాలు జారీ అయిన తర్వాత కూడా దాదాపు 20 రోజుల పాటు బోర్డు ఎందుకు తొలగించలేదో, కమిషనర్ ఎందుకు హాజరుకాలేదో వివరిస్తూ ఈ మధ్యాహ్నంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే రంగనాథ్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం హైడ్రా తరఫు న్యాయవాది అఫిడవిట్ను దాఖలు చేశారు. అందులో కోర్టు ఆదేశాలను అమలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, ఆ అఫిడవిట్పై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను నిర్దేశిత గడువులోగా ఎందుక స అమలు చేయలేదన్న అంశంపై సరైన వివరణ లేదని తప్పుపట్టింది.
అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్రావు కల్పించుకుని, హైకోర్టు ఆదేశాల అమలు ఆలస్యానికి గల కారణాలు పేర్కొనలేదని, కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, హైడ్రా కమిషనర్ అఫిడవిట్ అసమగ్రంగా ఉందని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, హైడ్రా కమిషనర్ అఫిడవిట్ అసమగ్రంగా, నిర్లక్ష్యంగా ఉందని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసినందున ఈ ఒక్కసారికి మాత్రమే దానిని అనుమతిస్తున్నామని, భవిష్యత్లో ఇలాంటి వ్యవహారాన్ని సహించబోమని స్పష్టం చేశారు. అఫిడవిట్లు కేవలం కోర్టుకు సహాయం చేయడానికే కాకుండా, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవం, విశ్వాసం ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కోర్టు ఆదేశాలను విస్మరించడం, తొందరపాటు చర్యలకు పాల్పడడం రంగనాథ్ కెరీర్ పైనే ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే కొంత ఆలస్యంగానైనా కోర్టు ఆదేశాలు అమలైనందున కోర్టు ధిక్కరణ పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్లో కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యం, జాప్యం లేదా అసమగ్ర వివరణలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరిస్తూ విచారణను ముగించారు.
