ఉప్లూర్లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ ఏనుగందుల శైలేందర్
సమరయోధుల త్యాగాలను ఆదర్శంగా తీసుకోవాలి
దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: సర్పంచ్
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
అనంతరం అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామ ప్రజలను ఉద్దేశించి సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి పోరాడి మనకు స్వరాజ్యం, స్వాతంత్య్రాన్ని అందించారని గుర్తుచేశారు. వారి త్యాగాలు, ఆశయాలు, ఆలోచనా విధానాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు.
‘నేను.. నా దేశం’ అనే సందర్భం వచ్చినప్పుడు మొదటి ప్రాధాన్యత దేశానికే ఇవ్వాలని సూచించారు. దేశ ప్రజల్లో స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సోదరభావం మరింత బలోపేతం అయ్యేలా ప్రతి ఒక్కరూ కృషి చేసి దేశ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. తన వంతుగా ఉప్లూర్ గ్రామ అభివృద్ధికి, దేశ సేవకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ తక్కురి శేఖర్, పంచాయతీ కార్యదర్శి సౌందర్య, వార్డు సభ్యులు, వీఓఏలు, ఆశా కార్యకర్తలు, గ్రామ రాజకీయ ప్రముఖులు, యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
